మధ్యాహ్న వ్యాయామంతో మధుమేహానికి చెక్

వ్యాయామ వేళలు ప్రత్యేకంగా రక్తంలో చెక్కర స్థాయిపై ప్రభావం చూపుతాయా అనే అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు.

Advertisement
Update: 2023-05-31 12:18 GMT

మధ్యాహ్న వ్యాయామంతో మధుమేహానికి చెక్

మధుమేహం ఉన్నవారికి వ్యాయామం చాలా అవసరమని వైద్యులు సూచిస్తుంటారు. పోషకాహారం తీసుకోవటంతో పాటు వీరు సరైన వ్యాయామం చేయటం వలన రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అమెరికాలోని బ్రిగమ్ అండ్ ఉమెన్స్ హాస్పటల్, జాస్లిన్ డయాబెటిస్ రీసెర్చి సెంటర్ లకు చెందిన పరిశోధకులు మరొక నూతన విషయాన్ని తమ అధ్యయనంలో కనుగొన్నారు. మధ్యాహ్న సమయాల్లో చురుగ్గా ఉండటం వలన మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉన్నట్టుగా వీరు గుర్తించారు.

జాస్లిన్ డయాబెటిస్ రీసెర్చి సెంటర్ కి ప్రపంచంలోనే అత్యుత్తమమైన మధుమేహ చికిత్సా పరిశోధనల కేంద్రంగా గుర్తింపు ఉంది. రోజంతటిలో ఇతర సమయాల్లో చురుగ్గా ఉన్నవారికంటే మధ్యాహ్నాలు చురుగ్గా ఉన్నవారిలో మరింతగా రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉంటుందని అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు అంటున్నారు. బ్రిగమ్ అండ్ ఉమెన్స్ హాస్పటల్, జాస్లిన్ డయాబెటిస్ సెంటర్ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి.

వ్యాయామ వేళలు ప్రత్యేకంగా రక్తంలో చెక్కర స్థాయిపై ప్రభావం చూపుతాయా అనే అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. మధ్యాహ్నం వేళ శారీరకంగా చురుగ్గా ఉన్నవారిలో సంవత్సరం తరువాత చెక్కర స్థాయి నియంత్రణలో మెరుగైన ఫలితాలు కనిపించాయి. మధుమేహం ఉన్నవారికి వ్యాయామం చాలా మేలు చేస్తుందనే అంశానికి తమ అధ్యయనం మరొక ఉపయోగకరమైన విషయాన్ని జోడించిందని పరిశోధకులు వెల్లడించారు.

అధ్యయనం కోసం 2.400మందిని ఎంపిక చేసి వారి నడుముకి వారి శారీరక కదలికలు చురుకుదనాన్ని కొలిచే సాధనాన్ని ధరించవలసిందిగా సూచించారు. నాలుగేళ్లపాటు వీరిపై అధ్యయనం నిర్వహించారు. మొదటి సంవత్సరం చివరలో సమీక్షించినప్పుడు మధ్యాహ్నం పూట ఒక మాదిరినుండి తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన పనులు చేసినవారిలో రక్తంలో చెక్కర చాలా ఎక్కువస్థాయిలో తగ్గినట్టుగా గుర్తించారు. నాల్గవ సంవత్సరంలో కూడా వారిలో చెక్కర స్థాయి విషయంలో ఇదే ప్రయోజనం కనబడింది. వారు మధుమేహం కోసం వాడుతున్న మందులను ఆపగల అవకాశం కూడా కనిపించింది.

అయితే పరిశోధకులు తమ అధ్యయనానికి కొన్ని పరిమితులు సైతం ఉన్నాయంటున్నారు. వీరు మధ్యాహ్నపు శారీరక చురుకుదనాన్ని పరిశీలించారు కానీ... ఆయా వ్యక్తుల నిద్ర, తీసుకుంటున్న ఆహారాలు ఎలా ఉన్నాయనేది పరిగణనలోకి తీసుకోలేదు. భవిష్యత్తులో నిర్వహించబోయే అధ్యయనాల్లో మధ్యాహ్నపు శారీరక చురుకుదనం ఏ కారణంగా రక్తంలో చెక్కరని తగ్గిస్తుంది... అసలు శరీరంలో ఏం జరగటం వలన ఈ ఫలితం వచ్చింది... అనే అంశాలను సైతం పరిశీలించనున్నారు. దీనివలన వారు మధుమేహ బాధితులకు మధ్యాహ్నం చేయాల్సిన నిర్దిష్టవ్యాయామాలను సూచించే అవకాశం ఉంటుంది.

మున్ముందు చేయబోయే అధ్యయనాలనుండి మరిన్ని అంశాలపై గణాంకాలు తమకు అందుబాటులోకి వస్తాయని దీనివలన మధుమేహ చికిత్స విషయంలో పేషంట్లకు ఎవరికి వారికి ప్రత్యేకమైన సలహాలు, సూచనలు అందించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News