అటు సూర్యుడు ఇటు పొడిచినా.. మళ్లీ జగనే సీఎం

పేద ప్రజలకు మరింత మేలు చేయాలనే లక్ష్యంతోనే దూరదృష్టితో, రాజనీతిజ్ఞతతో జగన్‌ ముందుకు సాగుతున్నారని కొడాలి నాని చెప్పారు.

Advertisement
Update: 2024-02-24 03:03 GMT

సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలిపిన దార్శనికుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న జగన్‌.. పేదల సీఎంగా వర్ధిల్లుతున్నారని ఆయన చెప్పారు. అటు సూర్యుడు ఇటు పొడిచినా మళ్లీ సీఎం అయ్యేది జగనే అని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం తథ్యమని, సీఎంగా మరోసారి జగన్‌ ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని ఆయన తెలిపారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో శుక్రవారం కొడాలి నాని మాట్లాడారు. పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా పేదల ఖాతాల్లోకి రూ.2.57 లక్షల కోట్లను బటన్‌ నొక్కి పంపించారని ఆయన చెప్పారు. అదే చంద్రబాబు, పవన్‌ అయితే.. పేదలకు చెందిన ఈ డబ్బును బటన్లు నొక్కి తమ పెత్తందార్ల ఖాతాల్లో జమ చేసేవారని ఆయన విమర్శించారు. పెత్తందార్ల బొజ్జలు నింపేందుకే చంద్రబాబు, పవన్‌ తాపత్రయపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

పేద ప్రజలకు మరింత మేలు చేయాలనే లక్ష్యంతోనే దూరదృష్టితో, రాజనీతిజ్ఞతతో జగన్‌ ముందుకు సాగుతున్నారని కొడాలి నాని చెప్పారు. అందులో భాగంగానే విశాఖపట్ట‌ణాన్ని వర్తక, వ్యాపార, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారని తెలిపారు. తద్వారా వచ్చే సంపదతో పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చనేది జగన్‌ ఆలోచన అన్నారు. ప్రజలకు మేలు చేస్తే సహించలేని బాబు అండ్‌ కో మాత్రం అమరావతిలోనే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా ఇలా ఏ రాజధాని అయినా సుమారు 150 ఎకరాల్లోనే ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు అండ్‌ కో మాత్రం 33 వేల ఎకరాలను కాజేసేందుకే రైతులకు మాయమాటలు చెప్పి వారి భూములు సేకరించారని తెలిపారు. ఆ తర్వాత గ్రాఫిక్స్‌ చూపించి దొంగ నాటకాలు ఆడారని ఆయన ధ్వజమెత్తారు.

Tags:    
Advertisement

Similar News