వైఎస్ జగన్ పార్టీ అధ్యక్ష పదవిని కోల్పోతారా?

వైఎస్ జగన్ నియామకం చెల్లుబాటు లేకుండా పోవడంతో ఆయన అధ్యక్షుడిగా మరోసారి పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశం పెట్టి ఎన్నికలు నిర్వహించాలి.

Advertisement
Update: 2022-09-22 00:59 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఒకే రోజు రెండు విషయాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ బిల్ పాస్ చేయడం అసెంబ్లీలో రగడ సృష్టించింది. అసెంబ్లీ వెలుపల కూడా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు భిన్నాభిప్రాయలు వెలువడ్డాయి. అదే సమయంలో వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ నియామకం చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవల జరిగిన ప్లీనరీలో వైఎస్ జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు. ఈ విషయంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు మీడియాలో కూడా జగన్ శాశ్వత అధ్యక్షుడి హోదా విషయంపై విస్తృతంగా వార్తలు వచ్చాయి. వీటిని పరిశీలించిన ఈసీ జగన్ నియామకాన్ని తప్పు పట్టింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా ఎన్నికల జరగాల్సిందేనని తేల్చి చెప్పింది.

ఈసీ మార్గదర్శకాల నేపథ్యంలో ఇటీవల సవరించిన రాజ్యాంగాన్ని తిరిగి సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా వైఎస్ జగన్ శాశ్వత అధ్యక్షుడి హోదా చెల్లుబాటు కాకుండా పోతోంది. వాస్తవానికి ఈసీ వద్ద రిజిస్టర్ అయిన ప్రతీ పార్టీ రెండేళ్లకు ఒక సారి అంతర్గత ఎన్నికల నిర్వహించాలి. అధ్యక్షుడితో పాటు పలు పదవులకు ఎన్నికలు జరపాలి. కానీ ఈ విషయంలో వైసీపీ తప్పటడుగు వేయడంతో వైఎస్ జగన్ ప్రస్తుతానికి అధ్యక్ష పదవికి అనర్హుడిగా మారిపోయారు. గతంలో డీఎంకేకు కరుణానిధి శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నారంటూ చేసిన వాదన కూడా తేలిపోయింది. నిబంధనల ప్రకారం ప్లీనరీలో చేసిన సవరణ చెల్లదు. అంతే కాకుండా వైఎస్ జగన్ నియామకం కూడా రద్దు అయినట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్యవర్గం మరోసారి సమావేశం కావల్సి ఉన్నది.

వైఎస్ జగన్ నియామకం చెల్లుబాటు లేకుండా పోవడంతో ఆయన అధ్యక్షుడిగా మరోసారి పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశం పెట్టి ఎన్నికలు నిర్వహించాలి. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్దంగా మరోసారి వైఎస్ జగన్‌ను ఎన్నుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, ప్రతీ రెండేళ్లకు ఓ సారి మాత్రం ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుంటూనే ఉండాలి. మరోవైపు వైసీపీని స్థాపించింది వైఎస్ జగన్ కాదని శివకుమార్ అనే వ్యక్తి అని రఘురామ ఫిర్యాదు చేశారు. శివకుమార్ నుంచి భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉండటానికే శాశ్వత అధ్యక్షుడు అనే నియామకాన్ని తెరపైకి తెచ్చారనే వాదనలు ఉన్నాయి. అయితే, పార్టీలో అంతర్గతంగా ఎన్నికలు జరిపి.. వైఎస్ జగన్‌ను కార్యవర్గం మొత్తం అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఎవరి వద్ద నుంచి కూడా ఎలాంటి సమస్యలు ఉండబోవని తెలుస్తున్నది. ప్రస్తుతానికి అధ్యక్ష హోదా తాత్కాలికంగా కోల్పోయినా.. త్వరలోనే ఎన్నికలు జరిపి దాన్ని పునరుద్దరిస్తారని తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News