వీళ్ళ యాత్రలపై కోవిడ్ దెబ్బ తప్పదా..?

జనవరి రెండో వారం నాటికి కరోనా వైరస్ ప్రమాదకరంగా మారవ‌చ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అంటే చంద్రబాబు ప్రస్తుత పర్యటనలతో పాటు లోకేష్, పవన్ మొదలుపెట్టాలని అనుకుంటున్న యాత్రలకు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement
Update: 2022-12-22 06:54 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలు చేస్తున్న, చేయాలని అనుకుంటున్న యాత్రలపై కోవిడ్ దెబ్బ పడేట్లుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయటమే టార్గెట్‌గా పాదయాత్రలు, బస్సు యాత్రలు, జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ యాత్రలతో జగన్‌పై ఒత్తిడి పెంచేయాలన్నది ప్రతిపక్షాల నేతల లక్ష్యం. అయితే వీళ్ళ ప్రయత్నాలకు కోవిడ్ ఫోర్త్ వేవ్ రూపంలో గండిపడేట్లుంది. ప్రపంచంపై కరోనా ఫోర్త్ వేవ్ ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ విరుచుకుపడుతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.

దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖలు రాసింది. ముఖ్యమంత్రులతో పాటు చీఫ్ సెక్రటరీలతో కూడా టచ్‌లో ఉంది. ఇప్పటికే చైనా, జపాన్, కొరియా, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో గడచిన వారంలో 35 లక్షల కేసులు వెలుగుచూశాయి. కాబట్టి మనదేశంలో కూడా కేసులు పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీకి లేఖ రాశారు.

కోవిడ్ నిబంధనలను పాటించలేకపోతే పాదయాత్రను రద్దు చేసుకోవాలని మంత్రి రాహుల్ గాంధీకి పంపిన లేఖలో స్పష్టంగా చెప్పారు. రాహుల్ పాదయాత్ర ఏమవుతుందన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇదే సూత్రం ఏపీలోని నేతలకు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి పేరుతో జిల్లాలు తిరుగుతున్నారు. మరోవైపు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ కూడా యాత్ర పెట్టుకున్నారు. ఈ రెండు కాకుండా జనవరి 27వ తేదీ నుండి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారాహి వాహ‌నంతో యాత్రకు రెడీ అవుతున్నారు. కరోనా వైరస్ వ్యవహారం చూస్తుంటే మళ్ళీ మనదేశంలో ప్రమాదకరంగా మారేట్లుంది. జనవరి రెండో వారం నాటికి కరోనా వైరస్ ప్రమాదకరంగా మారవ‌చ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అంటే చంద్రబాబు ప్రస్తుత పర్యటనలతో పాటు లోకేష్, పవన్ మొదలుపెట్టాలని అనుకుంటున్న యాత్రలకు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవే నిబంధనలు జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు కూడా వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి నేతలంతా ఏమిచేస్తారో చూడాల్సిందే.

Advertisement

Similar News