చంద్రబాబు మిస్, తెరపైకి ఎన్టీఆర్.. ఈ భేటీల కథేంటి..?

చంద్రబాబుపై ఇంకా బీజేపీకి కోపం తగ్గలేదా..? రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అడక్కపోయినా సపోర్ట్ చేసినందుకు కనీసం జాలి లేదా..? గతంలో మోదీపై చంద్రబాబు చేసిన తీవ్ర ఆరోపణలు ఇంకా ఆ పార్టీ మరచిపోలేదా..? అందుకే ఫిలింసిటీలో భేటీ జరగలేదా..?

Advertisement
Update: 2022-08-22 02:55 GMT

రామోజీ ఫిలింసిటీలో అద్భుతమైన సెట్టింగ్, అందులో అమిత్ షా - చంద్రబాబు భేటీ అంటూ వార్తలొచ్చాయి. కానీ అది సాధ్యం కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ భేటీపై చివరి రోజు వరకూ వార్తలు బయటకు పొక్కలేదు, కానీ నోవాటెల్ లో ఓ విందు రాజకీయం నడిచింది. ఇంతకీ బీజేపీ ఆశిస్తున్నదేంటి..? ఆర్ఆర్ఆర్ సినిమాని పొగడాలి, నటీనటుల్ని కలవాలంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దర్నీ కలవాలి. దర్శకుడు రాజమౌళి తండ్రికి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి, ఎన్టీఆర్ తోపాటు రాజమౌళిని కూడా కలిసి ఉండొచ్చు. కానీ అది సినిమా భేటీ కాదని ఈజీగా అర్థమవుతోంది. కేవలం ఒక్క ఎన్టీఆర్ ని మాత్రమే కలవడంలో ఏదో ఆంతర్యం దాగి ఉంది.

బాబుపై కోపం తగ్గలేదా..?

చంద్రబాబుపై ఇంకా బీజేపీకి కోపం తగ్గలేదా..? రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అడక్కపోయినా సపోర్ట్ చేసినందుకు కనీసం జాలి లేదా..? గతంలో మోదీపై చంద్రబాబు చేసిన తీవ్ర ఆరోపణలు ఇంకా ఆ పార్టీ మరచిపోలేదా..? అందుకే ఫిలింసిటీలో భేటీ జరగలేదా..? అనే అనుమానాలు బయటపడుతున్నాయి. కేవలం రామోజీరావుని మాత్రమే కలిసిన ఫొటో బయటకు వచ్చింది కానీ, చంద్రబాబు భేటీ జరగలేదని అంటున్నారు.

కమ్మల ఓట్ల కోసమేనా..?

తెలంగాణలో కమ్మవారి ఓట్లకోసం బీజేపీ విపరీతంగా ప్రయత్నం చేస్తోంది. గతంలో టీడీపీకి సంప్రదాయ ఓటుబ్యాంక్ గా ఉండి, ఇప్పుడు చెల్లాచెదరైపోయిన కమ్మవారి ఓట్లను గుంపగుత్తగా తమ వైపు తిప్పుకోడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబుని దగ్గరకు తీస్తున్నారని అనుకున్నారంతా. కానీ అది జరక్కపోగా, బాబు చేతిలో మోసపోయిన ఎన్టీఆర్ ని అమిత్ షా కలవడం మాత్రం లాజిక్ కి అందకుండా ఉంది. తెలంగాణలో కమ్మ ఓటు బ్యాంక్ కావాలి కానీ, చంద్రబాబుని దగ్గరకు తీయకూడదనే ఉద్దేశంతో అమిత్ షా, ఎన్టీఆర్ ని మాత్రమే కలిశారని అంటున్నారు.

కక్కలేక, మింగలేక టీడీపీ..

మరోవైపు అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై టీడీపీనుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. ఎన్టీఆర్ భేటీని హైలైట్ చేసుకుంటే.. ఇటు చంద్రబాబు, లోకేష్ ఇమేజీ డ్యామేజీ అయిపోతుందని అనుకుంటున్నారు. అందుకే ప్రచారం చేసుకోవాలనుకుంటున్నా.. తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉన్నారు టీడీపీ నేతలు. ఎన్టీఆర్ వైపునుంచి ఎలాంటి స్పందన లేదు, కేవలం అమిత్ షా మాత్రమే.. తాను ఓ మంచి నటుడ్ని కలిశానంటూ ట్వీట్ చేసి సరిపెట్టారు.

Tags:    
Advertisement

Similar News