నేడు రాజమండ్రికి జగన్.. పెన్షన్ల రగడపై చాకిరేవు పార్ట్-2

ఏపీలో కొత్తగా 2లక్షల మంది లబ్ధిదారులను జనవరి నుంచి అదనంగా పెన్షన్ స్కీమ్ కి జోడించారు. పెన్షన్ పెంపు వారోత్సవాలంటూ అధికార వైసీపీ ఈ కార్యక్రమాన్ని పండగలా చేస్తోంది.

Advertisement
Update: 2023-01-03 03:06 GMT

ఏపీలో ప్రస్తుతం పెన్షన్ల రగడ కొనసాగుతోంది. జనవరి 1నుంచి 250 రూపాయలు పెంచి సామాజిక పెన్షన్ ను 2750గా చేశారు సీఎం జగన్. దీన్ని 3వేల వరకు పెంచుతానంటూ గతంలో ఆయన హామీ ఇచ్చారు కూడా. అయితే పెంపుతోపాటు, పెన్షన్లలో కోత కూడా పడిందనేది అసలు ట్విస్ట్. ఇంటి విస్తీర్ణం ఎక్కువగా ఉందని, ఇన్ కమ్ ట్యాక్స్ కట్టారని, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని.. ఇతరత్రా కారణాలతో 1.6 లక్షలమందికి పెన్షన్లు రద్దు చేస్తున్నామంటూ నోటీసులిచ్చింది ప్రభుత్వం. అయితే వారిలో చాలామందికి సమస్యను పరిష్కరించారు, తిరిగి పెన్షన్ ఇస్తున్నారు. వీరితోపాటు ఏపీలో కొత్తగా 2లక్షల మంది లబ్ధిదారులను జనవరి నుంచి అదనంగా పెన్షన్ స్కీమ్ కి జోడించారు. పెన్షన్ పెంపు వారోత్సవాలంటూ అధికార వైసీపీ ఈ కార్యక్రమాన్ని పండగలా చేస్తోంది.

కొత్తగా పెన్షన్ వచ్చినవారికి నేరుగా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు గ్రామ సభలు నిర్వహించి పెన్షన్లు ఇస్తున్నారు. ఇది జగనన్న మీకిచ్చిన కానుక అని చెబుతూ వారికి సంతోషం కలిగిస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం పెన్షన్ల కోతపై ప్రధానంగా అస్త్రాలు ఎక్కు పెట్టింది. దీన్ని సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. పెన్షన్లు తీసేస్తున్నామనేది కేవలం తప్పుడు ప్రచారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు సైతం ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, వైరి వర్గాలను తిట్టిపోయాలని ఉద్భోదించారు.

పెన్షన్ పెంపు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరంలో సీఎం జగన్ పర్యటిస్తారు. జిల్లాలోని పెన్షన్ లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి కార్యక్రంలో పాల్గొంటారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే పెన్షన్ పెంపు వారోత్సవాల్లో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. పెన్షన్ల విషయంలో విపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని ఆయన తీవ్రంగా ఎండగట్టే అవకాశముంది.

ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ సీఎం జగన్ విపక్షాలకు పదే పదే చాకిరేవు పెడుతున్నారు. గతంలో సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పెద్దగా ప్రతిపక్షాల జోలికెళ్లేవారు కాదు జగన్. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. పదే పదే పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తున్నారు. ఈరోజు రాజమండ్రిలో కూడా జగన్ ప్రసంగం దూకుడుగా ఉండే అవకాశముంది. ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించిన క్రమంలో.. గుంటూరు సంఘటనను కూడా జగన్ ఉదహరిస్తారని, ఆ క్రమంలో చంద్రబాబుని తూర్పారబడతారనే అంచనాలున్నాయి. అయితే బీఆర్ఎస్ ఆవిర్భావంపై వైసీపీ నేతలు చేసిన హడావిడిని జగన్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై జగన్ ఈరోజు కామెంట్ చేస్తారో లేదో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News