గుడివాడలో టీడీపీ కార్యకర్తల అలజడి..గుంపులుగా పీఎస్‌లోకి వెళ్లేందుకు యత్నం..

కృష్ణా జిల్లా గుడివాడలో అలజడులు సృష్టిద్దామనుకున్న టీడీపీ నేతల పాచికలు పారలేదు.

Advertisement
Update: 2022-09-11 14:39 GMT

కృష్ణా జిల్లా గుడివాడలో అలజడులు సృష్టిద్దామనుకున్న టీడీపీ నేతల పాచికలు పారలేదు. ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీ కార్యకర్తలు, శ్రేణుల చర్యలను అడ్డుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు చేయడం నానికి కొత్తేమీ కాదు గానీ.. ఈ సారి డోస్ పెంచారు. కాస్త సీరియస్ గా తిట్లదండకం అందుకున్నారు. ఇటీవల లోకేశ్ సహా టీడీపీ నేతలు కూడా జగన్ మోహన్ రెడ్డి కుటుంసభ్యులపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

జగన్ భార్య, తల్లిని కూడా వివాదంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో నాని కూడా వారికి కౌంటర్ కాస్త గట్టిగానే ఇచ్చారు. దీంతో తెలుగుదేశం నేతలు నిరసనకు పిలుపునిచ్చారు. గుడివాడ చుట్టుపక్కల నియోజకవర్గ కార్యకర్తలందరినీ కూడ గట్టేందుకు ప్రయత్నం చేశారు. వారందరూ భారీ సంఖ్యలో గుడివాడ వెళ్లి.. అక్కడ కొడాలి నానిపై ఫిర్యాదు చేయాలని ప్లాన్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎక్కడికక్కడ నేతలను అడ్డుకున్నారు.

అయినప్పటికీ కొంతమంది నాయకులు గుడివాడలోకి అడుగుపెట్టారు. వారంతా కలిసి.. గుడివాడ పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో గుంపులుగా పోలీస్ స్టేషన్ కు రావడం కుదరని పోలీసులు తేల్చిచెప్పారు. ఎవరైనా ఒకరిద్దరు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పారు. దీంతో టీడీపీ నేతలు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గుడివాడలో భారీగా కార్యకర్తలు చేరుకొని అలజడి సృష్టించాలనుకున్న టీడీపీ నేతల ప్లాన్ ను పోలీసులు ఈ విధంగా భగ్నం చేశారు.

Tags:    
Advertisement

Similar News