నా మనస్తత్వానికి సరిపోయే ఏ పార్టీ అయినా నాకు ఓకే

కేశినేని నాని పరోక్షంగా టీడీపీ నాయకత్వానికి సవాల్ విసిరేలా కామెంట్‌ చేశారు. ఏ పిట్టల దొరకు సీటిచ్చినా తమకు ఇబ్బంది లేదన్నారు. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీకి సిద్ధమని ప్రకటించారు.

Advertisement
Update: 2023-05-31 11:01 GMT

నా మనస్తత్వానికి సరిపోయే ఏ పార్టీ అయినా నాకు ఓకే

టీడీపీ నాయకత్వంతో అంటీముట్టనట్టు ఉంటున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమని ప్రకటించారు. తనకు ట్రాక్ రికార్డు ఉందన్నారు. తాను చేసినన్ని పనులు ఎంపీగా దేశంలో ఎవరూ చేయలేదన్నారు. కేశినేని నాని ఇటీవల వైసీపీ నేతలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైసీపీలోకి నాని వస్తే ఆహ్వానిస్తామని రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా ప్రకటించారు.

అటు టీడీపీ కూడా కేశినేని నానిపై ఆశలు వదులుకున్నట్టుగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్‌ ఇచ్చేందుకు టీడీపీ దాదాపు సిద్ధమైంది. చిన్నిని పార్టీ ప్రోత్సహించడం మొదలైన తర్వాత నాని మరింత దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని పరోక్షంగా టీడీపీ నాయకత్వానికి సవాల్ విసిరేలా కామెంట్‌ చేశారు. ఏ పిట్టల దొరకు సీటిచ్చినా తమకు ఇబ్బంది లేదన్నారు. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీకి సిద్ధమని ప్రకటించారు.

తన మాటలను టీడీపీ నాయకత్వం ఎలా తీసుకున్నా తనకు భయం లేదంటూ కామెంట్స్‌ చేశారు. మళ్లీ ఎంపీ అవుతానా.. లేదా.. అన్న భయం తనకు లేదన్నారు. అభివృద్ధి విషయంలో ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తానన్నారు. తన మనస్తత్వానికి సరిపోయే ఏ పార్టీ అయినా తనకు ఓకే అన్నారు. ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా తనకు ఇబ్బంది లేదన్నది సోదరుడు కేశినేని చిన్నిని ఉద్దేశించేనని అంతా భావిస్తున్నారు.

కేశినేని నాని టీడీపీ ఎంపీ అయినప్పటికీ తన పార్లమెంట్ స్థానం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లి అడిగితే ఎంపీ నిధులను కేటాయిస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్‌ ఇది వరకే ఇలా 50 లక్షల రూపాయలు ఎంపీ నిధులను తీసుకొచ్చారు. ప్రస్తుతం కేశినేని నాని చేసిన వ్యాఖ్యలతో ఇక టీడీపీకి ఆయనకు మధ్య సయోధ్య సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News