వీర్రాజు మాట చెల్లుబాటు కావటం లేదా?

వీర్రాజు చెప్పినట్లు కన్నా మీద యాక్షన్ తీసుకుంటే పార్టీ నష్టపోవటం ఖాయమని ఢిల్లీ పెద్దలు భావించారట. అందుకనే వీర్రాజు మాటకు పెద్దగా విలువ ఇవ్వటంలేదని తెలుస్తోంది.

Advertisement
Update: 2023-02-04 07:29 GMT

పార్టీలో ఇప్పుడు ఈ అంశంపైనే నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆయన మద్దతుదారులపై గట్టి చర్యలు తీసుకోవాలని వీర్రాజు ఢిల్లీ పెద్దలను ఎంతగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. వీర్రాజు-కన్నా మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులా తయారైన విషయం అందరికీ తెలిసిందే. తనకు వ్యతిరేకంగా వీర్రాజు కుట్రలు చేస్తున్నారని కన్నాకు అనుమానం.

ఇదే సమయంలో పార్టీలో అందరిముందు కన్నా కావాలనే తనను పలుచన చేస్తున్నారని వీర్రాజు మండిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య ఏడుగురు జిల్లాల అధ్యక్షులను వీర్రాజు మార్చేశారు. వాళ్ళంతా కన్నా నియమించినవాళ్ళే. దాంతో పార్టీలో కన్నాతో పాటు ఆయన మద్దతుదారులను వీర్రాజు వేధింపులకు గురిచేస్తున్నారంటూ పెద్ద గొడవ మొదలైపోయింది. ఈ కారణంగానే ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా కన్నా పాల్గొనలేదు.

అదే సమయంలో కన్నాతో మిత్రపక్షం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ భేటీ అవటం సంచలనంగా మారింది. వీర్రాజు వేధింపుల వల్లే కన్నా పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు ఢిల్లీలోని అగ్రనేతలకు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. ఇద్దరు నేతల మధ్యా సయోధ్యకు బీజేపీ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో ఏదో ఒక‌రోజు కన్నా బీజేపీకి రాజీనామా చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నాయకత్వం సూచనల ప్రకారమే శివప్రకాష్ నేత సీనియర్ నేత కన్నాతో భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే కన్నాపై చర్యలు తీసుకోవాలని వీర్రాజు పట్టుబట్టారట. కన్నాకు వ్యతిరేకంగా వీర్రాజు పెద్ద రిపోర్టే అందించారని సమాచారం. అయితే సోము మాటలను ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదని పార్టీలో టాక్ నడుస్తోంది. ఆ మధ్య వీర్రాజుపై ఆరోపణలు చేస్తు మాచర్ల, పెదకాకానికి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు మొత్తం 500 మంది పార్టీకి రాజీనామా చేయటం కలకలం రేపింది. వీర్రాజు చెప్పినట్లు కన్నా మీద యాక్షన్ తీసుకుంటే పార్టీ నష్టపోవటం ఖాయమని ఢిల్లీ పెద్దలు భావించారట. అందుకనే వీర్రాజు మాటకు పెద్దగా విలువ ఇవ్వటంలేదని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News