షర్మిలకు డిపాజిట్ కూడా రాదు, అదే నా బాధ..

సానుభూతి కోసం మీరే దాడి చేయించుకున్నారని చంద్రబాబు అంటున్నారు కదా అని అడ‌గ్గా.. సానుభూతి కోసమే అయితే చంద్రబాబు పది రాళ్లతో దాడి చేయించుకోవచ్చు కదా అని జగన్ వ్యాఖ్యానించారు.

Advertisement
Update: 2024-04-30 09:13 GMT

వైఎస్ షర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తున్నందుకు బాధ ఏమీ లేదని, ఆమెకు డిపాజిట్ కూడా రాదని, అదే తన బాధ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇండియా టుడే కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అది కాంగ్రెస్ కుట్ర అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీయే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చార్జిషీట్ లో పెట్టిందని, తనపై తప్పుడు కేసులు బనాయించిందని ఆయన అన్నారు. అటువంటి కాంగ్రెస్‌లో షర్మిల పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

ఎన్నికల తర్వాత అవసరమైతే కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తారా అని అడిగితే, బీజేపీ తనకు వ్యతిరేకంగా టీడీపీ కూటమిలో ఉందని, ఇప్పుడు మద్దతు గురించి మాట్లాడడం ఊహాజనితమే అవుతుందని ఆయన అన్నారు. తాను బీజేపీతోనే కాకుండా కాంగ్రెస్ తో కూడా పోరాటం చేస్తున్నానని ఆయన అన్నారు.

గులకరాయి దాడి గురించి కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చింది. సానుభూతి కోసం మీరే దాడి చేయించుకున్నారని చంద్రబాబు అంటున్నారు కదా అని అడ‌గ్గా.. సానుభూతి కోసమే అయితే చంద్రబాబు పది రాళ్లతో దాడి చేయించుకోవచ్చు కదా అని జగన్ వ్యాఖ్యానించారు. రాజధాని పేర అమరావతి విషయంలో భారీ కుంభకోణం జరిగింది. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని, పదీ పదిహేనేళ్లు పోతే ఆ ఖర్చు పది లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని, అంత ఖర్చు పెట్టి దాన్ని నిర్మించడం అవసరమా అని జ‌గ‌న్‌ అన్నారు. ఆ డబ్బును రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టవచ్చు కదా అని జగన్ అన్నారు.

ఇదివరకే అభివృద్ధి చెందిన విశాఖపట్నం రెడీగా ఉందని, విశాఖను రాజధానిగా చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లను తలదన్నే నగరమవుతుందని ఆయన చెప్పారు. అన్ని వసతులు విశాఖపట్నంలో ఉన్నాయని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News