దొంగఓట్ల గురించి చంద్రబాబు మాట్లాడటమా..?

ఐదు నెలల క్రితం ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ గతంలో చేర్పించిన దొంగఓట్లను ఇప్పుడు తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం చంద్రబాబు మరచిపోయారేమో.

Advertisement
Update: 2024-01-16 06:54 GMT

‘ఈ స్థాయిలో అక్రమాలు గతంలో ఎప్పుడూ చూడలేదు’...ఇది చంద్రబాబునాయుడు చేసిన కామెంట్. ఇంతకీ ఈ కామెంట్ దేనిగురించి అంటే దొంగఓట్లు చేర్పించటం గురించి. చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగఓట్లను చేర్పించిందట వైసీపీ. తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడులో కూడా వేలల్లో వైసీపీ నేతలు దొంగఓట్లను చేర్పించినట్లు నానా రచ్చచేశారు. ఇక్కడే చంద్రబాబు వ్యవహారం గురివింద గింజ నీతిని బయటపెట్టింది. చంద్రబాబు లేదా తెలుగుదేశంపార్టీకి అసలు దొంగఓట్లంటేనే ఏమిటో తెలీనట్లు మాట్లాడారు.

టీడీపీ ఎప్పుడు గెలిచినా నిఖార్సయిన ఓట్లతోనే గెలిచినంత బిల్డప్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళు దొంగఓట్లను చేర్పించుకుంటున్నది వాస్తవం. ఎప్పటిదో చరిత్రను వదిలేసినా 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా లక్షల్లో దొంగఓట్లను చేయించిన విషయాలు చాలా బయటపడ్డాయి. అప్పట్లో దానిపైన వైసీపీ చాలా పోరాటాలు చేసి సుమారు 40 లక్షల దొంగఓట్లను తొలగించగలిగింది. దానిపై అప్పట్లో చంద్రబాబుతో పాటు సీనియర్ తమ్ముళ్ళు వైసీపీపై నానా గొడవలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా దొంగఓట్లను చేర్పిస్తూనే ఉన్నారు.

మిగిలిన నియోజకవర్గాలను వదిలేసినా కుప్పంలోనే 17 వేల దొంగఓట్లను తొలగించినట్లు అప్పటి ఎన్నికల కమిషనర్ బన్వర్ లాల్ మీడియా సమావేశంలోనే ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అయితే కుప్పంలో దొంగఓట్లు చేర్పించే అవకాశాలు తక్కువే కదా. తొలగించిన దొంగఓట్లన్నీ టీడీపీ నేతలు చేర్పించినవే అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే చంద్రబాబు హయాంలో నంద్యాల ఉపఎన్నిక జరిగింది.

ఆ ఉప ఎన్నికలో కూడా టీడీపీ వేలల్లో దొంగఓట్లు చేయించినట్లు చాలా ఆరోపణలు వచ్చాయి. అన్ని దొంగఓట్లు చేర్పిస్తేనే టీడీపీ 26 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిందని వైసీపీ నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లు చేర్పించకపోయుంటే వైసీపీనే గెలిచుండేదని అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా సార్లు మండిపడ్డారు. ఈమధ్యనే ఓ ఐదు నెలల క్రితం ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ గతంలో చేర్పించిన దొంగఓట్లను ఇప్పుడు తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం చంద్రబాబు మరచిపోయారేమో. అప్పట్లో తాము చేర్పించిన దొంగఓట్లను ఇప్పుడు తొలగిస్తున్నారన్న మంటే చంద్రబాబులో కనబడుతోంది. దొంగఓట్లను తొలగిస్తే తాము గెలవలేమన్న భయం చంద్రబాబులో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ఇంతగా గోల చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News