సీఎం జగన్ సభలో అపశృతి.. వృద్ధురాలికి తీవ్ర గాయాలు

సీఎం జగన్ బహిరంగ సభలో ఈరోజు దురదృష్ట సంఘటన జరిగింది. పింఛన్ పెంపుతో జగన్ కి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చిన వృద్ధురాలు బస్సు దిగుతూ కిందపడి గాయాలపాలైంది.

Advertisement
Update: 2023-01-03 08:41 GMT

ఏపీలో సభలు, సమావేశాలు, ప్రమాదాలు, పరిహారాలు.. ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లోకెక్కుతున్నాయి. తాజాగా సీఎం జగన్ పాల్గొన్న రాజమండ్రి సభలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. 70 ఏళ్ల వయసున్న ఆమె ప్రాణాపాయ స్థితిలో కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. పింఛన్ కానుక వారోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆ వృద్ధురాలు చివరికి ఆస్పత్రిపాలైంది.

పింఛన్ పెంపుని ప్రచారం చేసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో కొత్తగా పింఛన్ తీసుకునేవారికి నేరుగా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు వాలంటీర్ల సాయంతో ప్రభుత్వ సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో రాజమండ్రిలో పింఛన్ పెంపు వారోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సభకు భారీగా జన సమీకరణ జరిగింది. నేరుగా సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమం కాబట్టి.. జిల్లా నలుమూలలనుంచి లబ్ధిదారుల్ని తీసుకొచ్చారు నాయకులు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఇందుకోసం ఉపయోగించారు.

ఇటీవల కందుకూరులో జరిగిన చంద్రబాబు సభలో 8మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గుంటూరు సభలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు దుర్ఘటనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, సభలు, సమావేశాలు, రోడ్ షో లపై ఆంక్షలు విధించింది. అయితే అనుకోకుండా సీఎం జగన్ బహిరంగ సభలో ఈరోజు దురదృష్ట సంఘటన జరిగింది. పింఛన్ పెంపుతో జగన్ కి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చిన వృద్ధురాలు బస్సు దిగుతూ కిందపడి గాయాలపాలైంది. బస్సు దిగుతూ ఆమె జారిపడిపోయింది. పక్కనే ఉన్న మరో వాహనం ఆ వృద్ధురాలు మీదకు ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ నాయకులు వెంటనే ఆమెను కాకినాడ ఆస్పత్రికి తరలించారు.

Tags:    
Advertisement

Similar News