సీఎం కోసం చెట్లు నరకలేదు- ఈనాడు కథనంపై అధికారులు

ముఖ్యమంత్రి భద్రత పేరుతో వేపుగా పెరిగిన పచ్చని చెట్ల‌ను అధికారులు నరికి వేయిస్తున్నారని.. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ ఈనాడు పత్రిక కథనం రాసింది.

Advertisement
Update: 2023-01-25 03:58 GMT

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనలకు వెళ్లినా అక్కడ ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుబంధ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు తీసుకునే జాగ్రత్తలపైన మీడియా పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతోంది. ట్రాఫిక్ మళ్లించడాన్ని కూడా తప్పుపడుతోంది. కొన్నిచోట్ల అధికారుల అత్యుత్సాహం కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఊతమిస్తోంది.

తాజాగా ఈనెల 28న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠానికి వస్తున్న నేపథ్యంలో అటుగా వెళ్లే ప్రధాన రహదారి వెంబడి డివైడర్లపై ఉన్న చెట్ల‌ను సిబ్బంది నరికి వేయడం వివాదాస్పదమైంది. ఈ చెట్ల నరికివేతను ముఖ్యమంత్రి పర్యటనకు ఆపాదిస్తూ పత్రికలు కథనాలు ప్రచురించాయి.

ముఖ్యమంత్రి భద్రత పేరుతో వేపుగా పెరిగిన పచ్చని చెట్ల‌ను అధికారులు నరికి వేయిస్తున్నారని.. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ ఈనాడు పత్రిక కథనం రాసింది. ఈ కథనం చూసిన తర్వాత చాలామందికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇలా చెట్లను నరికి వేయడం ఏంటి అన్న అసంతృప్తి కూడా కలిగింది. అయితే అధికారుల వివరణ మాత్రం మరోలా ఉంది.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ చెట్లను తాము నరికి వేయలేదని అధికారులు చెబుతున్నారు. సదరు డివైడర్ వెడల్పు కేవలం 40 సెంటీమీటర్లు మాత్రమే ఉందని, అక్కడ నాటిన చెట్లు వేపుగా పెరుగుతూ ఉండటంతో డివైడర్ గోడలు దెబ్బతింటున్నాయని అందుకే ఆ చెట్లను తొలగించామని జీవీఎంసీ ఉద్యాన విభాగం డిడి దామోదర్ తెలిపారు. డివైడర్ వెడల్పు చాలా తక్కువగా ఉండడం వల్ల చెట్ల పెరుగుదలకు అవసరమైన పరిస్థితి అక్కడ లేకపోవడంతో, ఈదురు గాలులు వస్తే ఆ చెట్లు తట్టుకొని నిలబడే పరిస్థితి కూడా లేదని అందుకే వాటిని తొలగించాల్సి వచ్చిందన్నారు. సదరు డివైడర్ పై గడ్డి పెంచాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అధికారులకు వివరణ సహేతుకంగా ఉన్నప్పటికీ సరిగ్గా ముఖ్యమంత్రి పర్యటన సమయంలోనే ఇలా చెట్లను నరికేయడంతో చెట్ల నరికివేతకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధం ఉందన్న అభిప్రాయానికి అవకాశం ఇచ్చినట్టు అయింది. 

Tags:    
Advertisement

Similar News