ఆఖరి అవకాశాన్ని లోకేష్ ఎందుకు వదిలేశారు..?

ఈ నెలాఖరు వరకే ఆయనకు ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది. ఆ తర్వాత ఆయన మాజీ ఎమ్మెల్సీనే. మరి చివరి అవకాశాన్ని లోకేష్ ఎందుకు వదిలేసినట్టు..?

Advertisement
Update: 2023-03-16 09:16 GMT

ఎన్నికలకు ఏడాది ముందు ఏపీలో జరుగుతున్న కీలక బడ్జెట్ సమావేశాలివి. ఈ సమావేశాల్లో అయినా టీడీపీ తన ఉనికి చాటుకుంటుందేమో అని అనుకున్నారంతా. కానీ చంద్రబాబు డుమ్మా కొట్టేశారు. సీఎం అయ్యే వరకు అసెంబ్లీ గడప తొక్కను అంటూ గతంలో ఆయన చేసిన ఛాలెంజ్ కి కట్టుబడి సభకు, సమావేశాలకు దూరంగా ఉన్నారు. పోనీ లోకేష్ అయినా సభకు వస్తారనుకుంటే అదీ లేదు. ఆయన పాదయాత్రలో బిజీగా ఉన్నారు. అయితే లోకేష్ ఆ తర్వాత సభకు వస్తామన్నా కుదరదు. ఈనెలాఖరు వరకే ఆయనకు ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది. ఆ తర్వాత ఆయన మాజీ ఎమ్మెల్సీనే. మరి చివరి అవకాశాన్ని లోకేష్ ఎందుకు వదిలేసినట్టు..?

ఏపీలో ఇప్పటి వరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాలన్నీ ఏకపక్షంగానే ముగిశాయి. సభలో టీడీపీకి మాట్లాడేంత సీన్ ఎప్పుడూ లేదు. ఒకవేళ మాట్లాడినా, వైసీపీకి ఉన్న భారీ మెజార్టీ కారణంగా అందరూ ఏకపక్షంగా దాడికి దిగేవారు. ఆ మాటలు తట్టుకోలేకే చంద్రబాబు అసెంబ్లీలోనే కంటతడి పెట్టి సైలెంట్ అయ్యారు. అటు మండలిలో కూడా వైసీపీదే పూర్తి మెజార్టీ కావడంతో టీడీపీకి సభ్యులకు మాట్లాడేంత సీన్ లేదు. దీంతో నారా లోకేష్ ఎందుకొచ్చిన గొడవ అనుకుని సమావేశాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా ఆయన యాత్రకు బ్రేక్ ఇచ్చి కౌన్సిల్ కి రాలేదు.

ఎన్నికలపై ఫోకస్..

నారా లోకేష్ పూర్తిగా ఎన్నికలపైనే ఫోకస్ పెట్టినట్టున్నారు. తారకరత్న చనిపోయినప్పుడు మాత్రమే ఆయన యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రెండు రోజులు యాత్రకు దూరంగా ఉన్నారు. తాజాగా బడ్జెట్ సమావేశాలు మొదలైనా కూడా ఆయన శాసన మండలికి హాజరు కాలేదు. నెలాఖరు వరకే తన ఎమ్మెల్సీ పదవికి గడువు ఉన్నా కూడా లోకేష్ ఎందుకో పట్టనట్టే ఉన్నారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర 44వరోజు అన్నమయ్యజిల్లాలో కొనసాగుతోంది. యువతతో ముఖాముఖి మాట్లాడుతున్న లోకేష్.. నిరుద్యోగుల్ని వైసీపీ దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏపీ జాబ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా ఉండేదని, నేడు గంజాయి క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందని ఎద్దేవా చేశారు లోకేష్. జనాల్లో ఉండి విమర్శించడమే కానీ, ఆయన శాసన మండలికి వెళ్లాలని మాత్రం అనుకోలేదు.

Tags:    
Advertisement

Similar News