మైలవరంలో ఉమకు షాక్ తప్పదా?

నియోజకవర్గాలవారీగా జరుగుతున్న సమీక్షల్లో కూడా చాలామంది నేతలు ఉమకు వ్యతిరేకంగానే మాట్లాడారని సమాచారం. ఉమకు మైలవరంలో టికెట్ ఇవ్వద్దని చెప్పిన నేతలు గుడివాడలో పోటీ చేయిస్తే గట్టి క్యాండిడేట్ అవుతారని కూడా సూచించారట.

Advertisement
Update: 2022-11-09 05:20 GMT

వచ్చేఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు షాక్ తప్పేట్లులేదు. గెలుపు సంగతి తర్వాత అసలు టికెట్ దక్కుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గొల్లపూడిలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీలోని తమ్ముళ్ళతో పాటు కొందరు కమ్మ సామాజికవర్గం వాళ్ళు కూడా హాజరయ్యారు. గట్టిగా చెప్పాలంటే హాజరైనవాళ్ళల్లో అత్యధికులు ఉమ వ్యతిరేక గ్రూపుగా ముద్రపడినవారే. ఈ సమావేశానికి బొమ్మసాని సుబ్బారావు నాయకత్వం వహించారు.

సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మైలవరంలో పోటీచేయబోతున్న తనను గెలిపించాలని కోరటం కలకలం రేపుతోంది. ఒకవైపు ఉమ ఉండగా మరోవైపు సుబ్బారావు తనను గెలిపించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారంటేనే లోలోపల ఏదో జరుగుతోందనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఉమకు టికెట్ దక్కేది కూడా అనుమానమేనా అనే అనుమానాలు పార్టీలో మొదలయ్యాయి. ఒకవేళ ఉమ టికెట్ తెచ్చుకున్నా గెలుపు కష్టమనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి.

ఎందుకంటే మంత్రిగా ఉన్నపుడు తెచ్చుకున్న వ్యతిరేకత ఇంకా కంటిన్యూ అవుతోంది. మంత్రిగా ఉన్నసమయంలో ఉమ చాలా మందితో గొడవలుపడ్డారు. ఆయన బాడీ లాంగ్వేజీతోనే చాలామంది నేతలు దూరమైపోయారు. అందరూ కూడా మైలవరంలో ఉమకు టికెట్ ఇవ్వద్దని ఒకవేళ ఇస్తే ఓడిపోవటం ఖాయమని చంద్రబాబునాయుడుతోనే చెప్పారట. నియోజకవర్గాలవారీగా జరుగుతున్న సమీక్షల్లో కూడా చాలామంది నేతలు ఉమకు వ్యతిరేకంగానే మాట్లాడారని సమాచారం. ఉమకు మైలవరంలో టికెట్ ఇవ్వద్దని చెప్పిన నేతలు గుడివాడలో పోటీ చేయిస్తే గట్టి క్యాండిడేట్ అవుతారని కూడా సూచించారట.

సమీక్షల్లో ఉమకు వ్యతిరేకంగా నేతలు మాట్లాడటం, గుడివాడలో పోటీ చేయించమని సూచించటం, తాజాగా మైలవరంలో తనను గెలిపించాలని బొమ్మసాని అభ్యర్ధించటం చూస్తుంటే ఉమకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో ఉమ తిరుగుతుంటే నేతలు కూడా పెద్దగా వెంట ఉండటంలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కేవలం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడనే ట్యాగ్‌తోనే ఉమ పార్టీలో నెట్టుకొచ్చేస్తున్నారట. మరి సన్నిహితమే భారమైనపుడు చంద్రబాబు మాత్రం ఎంత కాలమని మోస్తారో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News