మోడీ-పవన్ భేటీ.. చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్

పవన్ సూచనకు మోడీ ఏ విధంగా స్పందిస్తారో అనే టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోందట. పవన్ సూచనకు మోడీ సానుకూలంగా ఉంటే ఒకపద్దతి లేకపోతే మరోపద్దతి. మోడీ ఒప్పుకుంటే చంద్రబాబుకు వెయ్యి ఏనుగుల బలమొచ్చినట్లవుతుంది.

Advertisement
Update: 2022-11-11 04:41 GMT

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనే సామెత చాలా పాపులర్. ఇప్పుడిదే పద్దతిలో నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్ భేటీ చంద్రబాబు నాయుడులో టెన్షన్ పెంచేస్తోందట. రెండురోజుల పర్యటన కోసం మోడీ విశాఖకు వస్తున్న విషయం తెలిసిందే. మోడీ పర్యటనలో మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారా.. లేదా.. అనే సందేహాలు బాగా పెరిగిపోయాయి. మోడీతో పవన్ భేటీ అయ్యే అవకాశాలున్నాయని, 11వ తేదీ సాయంత్రం నుంచి విశాఖలో మోడీకి అందుబాటులో ఉండాలని పవన్ కు మోడీ కార్యాలయం ఫోన్ చేసిందట.

దాంతో మోడీతో పవన్ భేటీ ఖాయమనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదే సమయంలో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందని సమాచారం. వాళ్ళిద్దరు భేటీ అయితే మధ్యలో చంద్రబాబుకు టెన్షన్ ఎందుకు..? ఎందుకంటే దీనికి మూడు కారణాలున్నాయట. మొదటిదేమో వీళ్ళ భేటీలో రాష్ట్ర రాజకీయాలు మాత్రమే చర్చకు వస్తాయనటంలో సందేహంలేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా కలుపుకుని వెళ్ళాలని పవన్ గట్టిగా చెప్పే అవకాశముంది.

పవన్ సూచనకు మోడీ ఏ విధంగా స్పందిస్తారో అనే టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోందట. పవన్ సూచనకు మోడీ సానుకూలంగా ఉంటే ఒకపద్దతి లేకపోతే మరోపద్దతి. మోడీ ఒప్పుకుంటే చంద్రబాబుకు వెయ్యి ఏనుగుల బలమొచ్చినట్లవుతుంది. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఇదే సమయంలో మోడీ అంగీకరించకపోయినా.. లేదా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయినా.. గాలితీసేసిన టైరు లాగైపోతుంది చంద్రబాబు పరిస్థితి.

అంటే మోడీతో పవన్ భేటీ ఒకవిధంగా చంద్రబాబుకు ఎంతటి కీలకమో అర్ధమవుతోంది కదా. ఇవిరెండు కాకుండా మరో సమస్య కూడా ఉంది. ఇదేమిటంటే బీజేపీ, జనసేన మాత్రమే పోటీచేయాలని గనుక మోడీ గట్టిగా చెబితే పవన్+చంద్రబాబు కూడా ఒకేసారి ఇబ్బందుల్లో పడిపోతారు. స్వయంగా మోడీయే బీజేపీతో కలిసి పోటీచేయాలని చెప్పిన తర్వాత పవన్ కాదనే అవకాశాలు చాలా తక్కువ. అదే జరిగితే టీడీపీ-బీజేపీ+జనసేన-వైసీపీ మధ్య త్రిముఖ పోటీ జరగటం ఖాయం. దానివల్ల పవన్ కు జరిగే నష్టంసంగతి పక్కనపెట్టేస్తే చంద్రబాబు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఈ నేపథ్యంలోనే భేటీలో ఏమి జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోందట ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో.

Tags:    
Advertisement

Similar News