చివరి ఎన్నికలంటే ఎవరూ జాలిపడి ఓటెయ్యరు.. చంద్రబాబుపై అంబటి ఫైర్

నీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటే గెలిపిస్తారన్నారు. ఛాన్స్ ఇక రాదని అనిపించినప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అంబటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాననే కాన్ఫిడెన్స్ చంద్రబాబులో కనిపించడం లేదన్నారు.

Advertisement
Update: 2022-11-17 06:38 GMT

నిన్న కర్నూలు జిల్లా పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఇవే నా చివరి ఎన్నికలని.. తనని గెలిపించాలని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద సంచలనం సృష్టించాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నాకు ఇవే చివరి ఎన్నికలు అని.. నన్ను గెలిపించాలని.. ప్రాధేయపడితే జనం ఓటు వేయరని చంద్రబాబుకు చురకలాంటించారు. ఇవాళ ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ చంద్రబాబు ఇవే నా చివరి ఎన్నికలు.. కాబట్టి నన్ను గెలిపించండి.. అని ప్రజలను కోరడం ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు. నీకు చివరి ఎన్నికలు అయితే గెలిపించాల్సిన అవసరం ప్రజలకు ఏముందని ఆయన ప్రశ్నించారు.

నీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటే గెలిపిస్తారన్నారు. ఛాన్స్ ఇక రాదని అనిపించినప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అంబటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాననే కాన్ఫిడెన్స్ చంద్రబాబులో కనిపించడం లేదన్నారు. అందుకే ప్రజలను ప్రాధేయపడుతూ చివరి ఛాన్స్ అంటూ వేడుకుంటున్నాడని.. ఇలా వేడుకుంటే ప్రజలు జాలిపడి ఓట్లు వేయరన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ జాలిపడి ఓటు వేయరని పేర్కొన్నారు.

రాజకీయాల్లో ఉండలేని స్థితికి వచ్చాడు కాబట్టే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇక అసెంబ్లీలో నన్ను.. నా భార్యను.. అవమానించారని చంద్రబాబు పాత పాట పాడటం ఓట్ల కోసమేనన్నారు. ఆ మాటకొస్తే జగన్ చేయని నేరానికి 16 నెలల పాటు జైల్లో ఉన్నారని.. ఆయనెప్పుడూ నన్ను అవమానించారని.. నాకు ఓటు వేయాలని.. ప్రజలను అడగలేదన్నారు. నన్ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పారే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడలేదన్నారు. ఇవే నా చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే.. ఆయన యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించినట్లు అర్థమవుతోందని అంబటి వ్యాఖ్యానించారు.

Advertisement

Similar News