ఫస్ట్ ఛాయిస్ బోండానే... కుదిరితే ఎమ్మెల్సీ

బోండా ఉమా గనుక నియోజకవర్గం మారేందుకు అంగీకరించకపోతే అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి కచ్చితంగా ఇస్తామని రాధాకు లోకేష్ హామీ ఇచ్చారని సమాచారం.

Advertisement
Update: 2023-03-08 05:44 GMT

వంగవీటి రాధాకృష్ణకు విషయాన్ని నారా లోకేష్ తేల్చి చెప్పేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ కేటాయింపు విషయంలో ఫస్ట్ ఛాయిస్ బోండా ఉమానే అని తేల్చేశారు. ఏ కారణం వల్లయినా బోండా గనుక సెంట్రల్ నియోజకవర్గంలో కాకుండా విజయవాడ వెస్ట్ లో పోటీ చేయటానికి సుముఖత వ్యక్తంచేస్తే అప్పుడు సెంట్రల్ టికెట్ తప్పకుండా ఇస్తామని రాధాకు లోకేష్ స్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. బోండా గనుక నియోజకవర్గం మారేందుకు అంగీకరించకపోతే అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి కచ్చితంగా ఇస్తామని రాధాకు లోకేష్ హామీ ఇచ్చారని సమాచారం.

పీలేరు నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న లోకేష్‌ను వంగవీటి రాధా కలిసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజన విరామం సమయంలో క్యారవాన్‌లో ఇద్దరి మధ్య దాదాపు గంటపాటు భేటీ జరిగింది. సెంట్రల్ టికెట్ విషయం, భవిష్యత్ రాజకీయాల గురించి మాట్లాడటానికే రాధా విజయవాడ నుండి పీలేరుకు వెళ్ళి లోకేష్‌ను కలిశారు. తాజా భేటీలో విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వటం కుదరదని రాధాకు లోకేష్ తేల్చిచెప్పేసినట్లే.

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తప్పకుండా వచ్చేస్తామని ఈ సమయంలో పార్టీ మార‌వ‌ద్ద‌ని గట్టిగా చెప్పారట. అందరం కలిసి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని చెప్పారట. ఒకవేళ సెంట్రల్ నియోజకవర్గంలో కాకుండా వేరే నియోజకవర్గంలో పోటీచేసే ఇంట్రస్టుంటే ఆ విషయం చెప్పమని కూడా లోకేష్ అడిగారట. దానికి రాధా అంత సానుకూలంగా స్పందించలేదట. ఏదన్నా ఉంటే ఆలోచించుకుని చెప్పమని చెప్పారట.

ఈనెల 14వ తేదీన జనసేనలో చేరటానికి రాధా డిసైడ్ అయ్యారనే ప్రచారం అందరికీ తెలిసిందే. బందరులో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ సమక్షంలోనే చేరేందుకు మూహుర్తం కూడా పెట్టుకున్నారని టాక్ ఉంది. అలాంటిది ఇప్పుడు లోకేష్‌తో భేటీ అవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరి తాజా భేటీలో లోకేష్ మాటలకు రాధా సానుకూలంగా స్పందించి టీడీపీలోనే కొన‌సాగుతారా? లేకపోతే టీడీపీని వదిలేసి జనసేనలో చేరుతారా అన్నది చూడాలి.

Tags:    
Advertisement

Similar News