ఏపీకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం

ఏపీ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించారు. పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించే వరకు జస్టిస్ శేషసాయి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు.

Advertisement
Update: 2023-05-20 01:41 GMT

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన స్థానంలో ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయన ఏపీ హైకోర్టులో నెంబర్‌ -2 స్థానంలో ఉన్నారు.

జస్టిస్ శేషసాయిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్వస్థలం. 1987 జులైలో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. సివిల్, క్రిమినల్, సర్వీస్, రాజ్యాంగ సంబంధ వ్యవహారాలపై ఆయనకు మంచి పట్టుంది. పోలవరం ప్రాజెక్ట్‌పై ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ తరపున ఆయన గతంలో వాదనలు వినిపించారు. 2013 ఏప్రిల్‌ 12న ఉమ్మడి ఏపీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

2014 సెప్టెంబర్‌ 8న ఉమ్మడి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో హైకోర్టు విభజన తర్వాత ఆయన ఏపీ హైకోర్టుకు కేటాయించబడ్డారు. అనేక కీలక కేసుల్లో ఆయన తీర్పులు ఇచ్చారు. పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించే వరకు జస్టిస్ శేషసాయి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు.

Tags:    
Advertisement

Similar News