ప్లాస్టిక్ సంగతి సరే, రుషికొండ కరిగిపోతోంది ఆపండి..

రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వానికి ఒక్కసారిగా పర్యావరణంపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో.. అంటూ వెటకారంగా వరుస ట్వీట్లు పెట్టారు.

Advertisement
Update: 2022-08-27 15:25 GMT

ఏపీ ప్రభుత్వానికి పర్యావరణంపై సడన్ గా అంత ప్రేమెందుకు పుట్టుకొచ్చిందంటూ సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్. ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నామంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఆయన పరోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వానికి ఒక్కసారిగా పర్యావరణంపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో.. అంటూ వెటకారంగా వరుస ట్వీట్లు పెట్టారు.

విశాఖపట్నంలో పారిశ్రామిక కాలుష్య నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, వరుస ఘటనలు జరుగుతున్నా.. విషవాయువుల లీకేజీ, మరణాలు అరికట్టేందుకు ఇంకా జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రమాదాల కారకులకు ఇప్పటివరకు శిక్షలు పడలేదన్నారు. మరోవైపు విశాఖలో రుషికొండను ఆక్రమించి విధ్వంసం సృష్టిస్తున్నా పట్టించుకోలేదని, అలాంటి ప్రభుత్వానికి సడన్ గా పర్యావరణంపై ప్రేమ పుట్టుకు రావడం ద్వంద వైఖరి కాక ఇంకేంటని ప్రశ్నించారు. రుషికొండ విషయంలో తమ పార్టీ తరపున పోరాటం చేసిన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ కి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్రంలో పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలు వివరాలు సేకరించాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు. వాటిని ప్రజా క్షేత్రంలో పెడదామని పేర్కొన్నారు.

కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. అడవులను నాశనం చేస్తున్న మైనింగ్ సంస్థల వివరాలు సేకరించాలన్నారు. కాలుష్యకారక ప్రాజెక్టులు, వాటి మూలంగా కలుగుతున్న హాని, ప్రజల ఆరోగ్యాలకు కలుగుతున్న నష్టాలను బయటపెట్టాలన్నారు. జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం గురించి ప్రజలకు వివరించాలని, కాలుష్యకారక పరిశ్రమల వల్ల జరుగుతున్న నష్టాలను చెప్పాలన్నారు పవన్ కల్యాణ్. వైసీపీని ప్రశ్నిస్తూ, జనసైనికులకు హితబోధ చేస్తూ పవన్ వేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Tags:    
Advertisement

Similar News