పవన్ ఆశలన్నీ ఉమ్మడి గోదావరి జిల్లాలపైనే.. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే..!

తన సొంత సామాజిక వర్గం అయిన కాపుతో పాటు క్షత్రియుల ఓట్లు కూడా తనవైపు తిప్పుకొని రాబోయే ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారాలని భావిస్తున్నారు పవన్ కల్యాణ్

Advertisement
Update: 2022-07-31 09:34 GMT

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త పీకే కూడా ఊహించనంతగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని ఏపీ ప్రజలు కట్టబెట్టారు. వైసీపీకి 175 నియోజకవర్గాలకు గాను 151 సీట్లు రావడానికి అనేక విశ్లేషణలు చెప్తుంటారు. కానీ ఇప్పటికీ ఆ విజయంలో కీలక పాత్ర పోషించింది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలనే చెప్పవచ్చు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి. కాపు, క్షత్రియ సామాజిక వర్గాల ఓటర్లు బలంగా ఉన్న ఈ జిల్లాల్లో వైసీపీ మెజార్టీ సాధించింది.

34 నియోజకవర్గాల్లో అత్యధికంగా వైసీపీ పరం కావడంతో ఊహించిన దాని కంటే ఎక్కువ సీట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఈ నియోజకవర్గాలపైనే ఆశలు పెట్టుకున్నారు. తన సొంత సామాజిక వర్గం అయిన కాపుతో పాటు క్షత్రియుల ఓట్లు కూడా తనవైపు తిప్పుకొని రాబోయే ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారాలని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ బయటకు బీజేపీ, టీడీపీతో పొత్తు.. రాష్ట్రమంతా పోటీ చేస్తామనే మాటలు చెప్తున్నా.. ఆయన టార్గెట్ మాత్రం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే ఉన్నదని సన్నిహితులు చెప్తున్నారు.

పవన్ కల్యాణ్ ఆ 34 నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్నా.. గ్రౌండ్ లెవెల్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు పథకాల ద్వారా తన అభిమానులను మరింతగా పెంచుకున్న సీఎం జగన్.. కాపు నేస్తం పథకం ద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లను కూడా చీలకుండా చూసుకుంటున్నారు. ఇక ఇటీవల గోదావరి వరదల సమయంలో స్వయంగా ముంపు గ్రామాల్లో పర్యటించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక రోజంతా గడిపిన సీఎం జగన్.. బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల సాయాలు చేసి ఆయన ఎలాంటి విమర్శలను ఎదుర్కోకుండా బయటపడ్డారు. వరదలు వచ్చి పోయిన వారం తర్వాత ఎందుకు వచ్చానో కూడా జగన్ వివరణ ఇచ్చారు. పోలవరం ముంపు బాధితుల సాయం, పునరావాసంపై కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో వరదలను సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం అనుకున్న ప్రతిపక్ష టీడీపీ, జనసేనలకు ఛాన్స్ లేకుండా పోయింది.

ఆ 34 నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గపు ఓట్లు చీల్చడం వల్ల వైసీపీనే గెలుస్తుందని పవన్ కల్యాన్‌కు తెలుసు కాబట్టే.. మొదటి నుంచి టీడీపీ, బీజేపీతో పొత్తుకు ఉవ్వీళ్లూరుతున్నారు. మరోవైపు తాను ఎక్కడి నుంచిపోటీ చేయాలనే విషయంపై కూడా పవన్ పలు ఆప్షన్లను ముందు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. కాగా, ఈసారి ఒక్క నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. అది కూడా తూర్పు గోదావరి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు కూడా చెప్పడంతో అటువైపే మొగ్గు చూపుతున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో తాను పోటీ చేయడం వల్ల జనసేన అభ్యర్థులకు కూడా కలసి వస్తుందని పవన్ అంచనా వేసుకుంటున్నారు. మరి ఎన్నికల నాటికి పవన్ వ్యూహాలు పని చేస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News