అధికారంలోకి వ‌స్తూ కూడా అంత భ‌య‌మెందుకు?

పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించేంత ధైర్యం కూడా లేని పవన్ రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించేస్తామని చాలెంజ్‌లు చేయటమే విచిత్రంగా ఉంది.

Advertisement
Update: 2023-10-03 05:33 GMT

కృష్ణా జిల్లాలో మొదలైన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా మాటలే చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించబోతున్నట్లు.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్ల కన్నా రావు అని అన్నారు. టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని బల్లగుద్దకుండానే చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క‌రి కథ‌ చెబుతానన్నారు. వైసీపీని ఓడించటం, 15 సీట్లకు మించి రావనిచెప్పటం, టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతున్నట్లు చెప్పటం భలే విచిత్రంగా ఉంది.

ఇన్నిమాటలు చెబుతున్న పవన్ రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుండి పోటీ చేయబోయేది మాత్రం చెప్పటంలేదు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే ఓడగొడతారని పవన్ ఎన్నిసార్లు చెప్పారో అందరికీ తెలిసిందే. పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించేంత ధైర్యం కూడా లేని పవన్ రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించేస్తామని చాలెంజ్‌లు చేయటమే విచిత్రంగా ఉంది. టీడీపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేయటాన్ని అసలు కలలో కూడా ఊహించుకోవటంలేదు.

ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు మరోసారి వీరమరణం తప్పదని పవనే అంగీకరించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చాలాసార్లు చెప్పారు. ప్రతిపక్షాలు దేనికదే పోటీ చేస్తే మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని స్వయంగా చంద్రబాబే చెప్పారు. అంటే రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే జగన్ దెబ్బకు మట్టికరుస్తాయని బాగా తెలుసు. అలాంటి రెండు పార్టీల అధినేతలు కలిసి జగన్‌ను ఓడించేస్తామని చెబుతున్నారు. గ‌త‌ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పవన్ ఓడిపోయారు.

అప్పటి నుండి పవన్‌కు జగన్ ఫోబియా బాగా పట్టుకున్నది. పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని చెప్పమని పార్టీ నేతలు ఎంతడిగినా చెప్పటంలేదు. పిఠాపురం, భీమవరం, విశాఖ ఉత్తరం, తిరుపతి, నరసాపురం నియోజవర్గాల నుండి పిలుపులు వస్తున్నా బహిరంగంగా స్పందించే సాహసం కూడా చేయలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించటం, 15 సీట్లకే పరిమితం చేయటం వేరే సంగతి. ముందు తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే అదే పది వేలన్నట్లుగా ఉంది పరిస్థితి. పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించలేని పవన్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.


Tags:    
Advertisement

Similar News