కాపుల ఆశలపై నీళ్ళు చల్లేసినట్లేనా..?

నిజానికి చాలామంది కాపుల్లో ఇదే విధమైన చర్చలు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే పవన్ మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనటంలేదని ప్రకటించటంలో అర్థ‌మేంటి..?

Advertisement
Update: 2023-01-27 05:50 GMT

‘నేను ముఖ్యమంత్రిని అయిపోవాలని కలలు కనటంలేదు.. ప్రజలు అంగీకరించి ఓట్లేస్తేనే సీఎం అవుతా’ ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఈ ఒక్క డైలాగుతో కాపు సామాజికవర్గం ఆశలపై పవన్ నీళ్ళు చల్లేశారు. ఎలాగంటే.. వచ్చేఎన్నికల్లో టీడీపీతో పవన్ పొత్తుపెట్టుకోవటం ఖాయమైపోయింది. ఈ విషయాన్ని స్వయంగా పవనే ప్రకటించారు కాబట్టి అనుమానం అవసరంలేదు. అయితే చంద్రబాబుతో పవన్ పొత్తుపెట్టుకోవటం చాలామంది కాపులకు సమ్మతం కాదు.

చంద్రబాబు ఆలోచనేమో కాపుల ఓట్లు వేయించుని అధికారంలోకి రావటమే. పవన్ ఆలోచన కూడా కాపుల ఓట్లు వేయించి చంద్రబాబును సీఎం చేయటమే. అంటే పొత్తు విషయంలో వీళ్ళద్దరూ క్లారిటీతోనే ఉన్నారు. అయితే మధ్యలో కాపులు మాత్రం పొత్తును వ్యతిరేకిస్తున్నారు. పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే టీడీపీ, జనసేన పొత్తును కాపులు ఆమోదించి ఓట్లేస్తారని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య కండీషన్ పెట్టారు. పవన్‌ను ప్రకటించకుండా పొత్తుపెట్టుకుంటే కాపులు ఓట్లేయరని జోగయ్య చెప్పారు.

నిజానికి చాలామంది కాపుల్లో ఇదే విధమైన చర్చలు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే పవన్ మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనటంలేదని ప్రకటించటంలో అర్థ‌మేంటి..? ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనటంలేదు కాబట్టి సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా పర్వాలేదు అని చంద్రబాబుకు చెప్పటమే కదా. పవన్‌ను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించేది అనుమానమే అనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు సీఎం అభ్యర్థిగా ప్రకటించమని పవనే అడగనప్పుడు ఇక చంద్రబాబు మాత్రం ఎందుకు ప్రకటిస్తారు..?

మరి పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్లు చేస్తున్న కాపుల పరిస్థితి ఏమిటి..? కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్న సామెతలాగా సీఎం అవ్వాలనే ఆశ, ఆలోచన పవన్ కే లేనప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ అన్న కాపుల డిమాండుకు అర్థ‌మేలేదు. మొత్తానికి కాపుల ఆశలపై స్వయంగా పవనే నీళ్ళు చల్లేశారు. తన ఆలోచనేంటో పవన్ స్పష్టంగా చెప్పేశారు కాబట్టి టీడీపీ, జనసేన పొత్తుకు ఓట్లేయాలా..? వద్దా..? అన్నది తేల్చుకోవాల్సింది కాపులే.

Tags:    
Advertisement

Similar News