కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి జగన్ సపోర్ట్.. సీపీఐ నారాయణ లాజిక్

కర్నాటకలో బీజేపీ 100సీట్లలో గెలిచేలా ఒప్పందం కుదిరిందట. ఆ 100 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులకు జగన్ డబ్బులు ఖర్చుపెట్టేలా డీల్ సెట్ అయిందనేది నారాయణ ఆరోపణ.

Advertisement
Update: 2023-03-30 15:57 GMT

రెండు వారాల గ్యాప్ లో రెండు సార్లు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈ పర్యటనలపై ఇప్పటికే టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. వైఎస్ వివేకా హత్యకేసు విచారణకు సంబంధించి అవినాష్ రెడ్డిని కాపాడుకునేందుకే జగన్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లారనేది టీడీపీ నేతల ఆరోపణ. ఇప్పుడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా వీరికి జతకలిశారు. వైఎస్ వివేకా హత్యకేసు విషయంలోనే జగన్ ఢిల్లీ వెళ్లారని నమ్మకంగా చెబుతున్నారు. అంతే కాదు, ఆ కేసులో అవినాష్ ని కాపాడితే.. బీజేపీకి జగన్ చేయబోయే ఫేవర్ ని కూడా ఆయన వివరించారు.

కర్నాటకలో 100 సీట్లు..

తాజా పర్యటనలో సీఎం జగన్, కేంద్ర మంత్రి అమిత్ షాతో రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు నారాయణ. వివేకా హత్యకేసు నుంచి అవినాష్ ని తప్పిస్తే.. కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి జగన్ సాయం చేస్తానని చెప్పారట. కర్నాటకలో బీజేపీ 100సీట్లలో గెలిచేలా ఒప్పందం కుదిరిందట. ఆ 100 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులకు జగన్ డబ్బులు ఖర్చుపెట్టేలా డీల్ సెట్ అయిందనేది నారాయణ ఆరోపణ. జగన్ సంపాదించిన అక్రమాస్తులు మొత్తం కర్నాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నారని ఆరోపించారు నారాయణ. బీజేపీతో ఒప్పందం కుదరడం వల్లే వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు ఆలస్యం అవుతుందన్నారు.

అందరం కలిసే ఓడిస్తాం..

ఏపీలో వైసీపీని ఓడించాలంటే ఒక్కరి వల్ల సాధ్యం కాదని, టీడీపీ, జనసేన, వామపక్షాలు అన్నీ కలసి రావాలన్నారు. అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వస్తే ప్రజల్లో విశ్వాసం వస్తుందన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలలో లెఫ్ట్ పార్టీ, టీడీపీ మధ్య అవగాహన వల్లే మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు నారాయణ. 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు తమ మధ్య చర్చలు జరగలేదని, పొత్తుల విషయంలో టీడీపీయే పెద్దన్న పాత్ర పోషించాలన్నారు నారాయణ. పొత్తులకు తాము రెడీ అని సంకేతాలిచ్చారు. 

Tags:    
Advertisement

Similar News