రెడ్లను తటస్థపరిచే ప్రయత్నంలో లోకేష్

జగన్‌ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఈ నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల రెడ్డి కుటుంబాలు నష్టపోయాయని చెప్పారు.

Advertisement
Update: 2022-11-14 03:18 GMT

రెడ్లకే జగన్‌ పెద్దపీట వేస్తున్నారని ఒకవైపు టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే నారా లోకేష్ మాత్రం అందుకు కాస్త భిన్నంగా మాట్లాడారు. జగన్‌ వల్ల రాష్ట్రంలో అనేక మంది రెడ్లు నష్టపోయారని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్బంగా మాట్లాడిన నారా లోకేష్.. 2019లో జగన్‌ను గెలిపించేందుకు రాష్ట్రంలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు అనేక త్యాగాలు చేశారన్నారు.

151 సీట్లతో జగన్ గెలిపిస్తే ఇప్పుడు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని కూడా తాడేపల్లి నివాసం బయటే నిలబెడుతున్నారని లోకేష్ విమర్శించారు. జగన్‌ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఈ నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల రెడ్డి కుటుంబాలు నష్టపోయాయని చెప్పారు.

అలా నష్టపోయిన వారంతా టీడీపీలోకి రావాల్సిందిగా లోకేష్ ఆహ్వానించారు. తాను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానని.. టీడీపీ అన్ని వర్గాల వారికి సముచిత స్థానం ఇస్తుందన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ దిగిపోవాల్సిన అవసరం ఉందని.. ఆ ప్రయత్నంలో రెడ్లు కూడా అరమరికలు లేకుండా టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. విశాఖలో జగన్‌ నిజస్వరూపం బయపడిందని.. ప్రధాని ముందు పిల్లిలా మ్యావ్ మ్యావ్ అంటూ ఉండిపోయారే గానీ.. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేకపోయారని లోకేష్ విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News