కేంద్రం డ‌బ్బులిస్తానంటుంటే.. ఏపీ ప్ర‌భుత్వం వ‌ద్దంటోంది..

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని కేంద్రం అంటే ఎవరైనా వద్దంటారా..? కానీ వారు హోదా మినహా ఇంకేదైనా అడగండి అంటారు.

Advertisement
Update: 2022-09-04 07:47 GMT

Vishnu Vardhan Reddy

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని కేంద్రం అంటే ఎవరైనా వద్దంటారా..? కానీ వారు హోదా మినహా ఇంకేదైనా అడగండి అంటారు. పోనీ పోలవరానికి సకాలంలో నిధులిస్తామంటే ఎవరైనా వద్దంటారా..? ఆ మాట వస్తే అది కాకుండా ఇంకోటి అడగండి అంటారు. రైల్వే జోన్, కొత్త రైల్వే లైన్లు, రైల్వే ప్రాజెక్ట్ లు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం.. ఇలా చాలా డిమాండ్లు ఏపీనుంచి వినపడుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడా వేటికీ ఓకే చెప్పని కేంద్రం ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలతో వితండవాదం చేయిస్తోంది. ఏపీకి కేంద్రం నిధులిస్తామంటుంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దంటూ లేఖలు రాస్తోందని ఆరోపణలు చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి.

రోడ్ల నిర్మాణం కోసం ఎన్డీబీ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం తన వాటా నిధులివ్వడానికి సిద్ధపడినా.. రాష్ట్రం తన వాటా ఇవ్వడానికి రెడీగా లేదని అన్నారు విష్ణువర్దన్ రెడ్డి. తమ దగ్గర మ్యాచింగ్ గ్రాంట్ లేదని, అందుకే కేంద్రం నిధులు తమకు వద్దంటూ వైసీపీ ప్రభుత్వం లేఖ రాసిందని ఆరోపించారు. వైసీపీ వైఖరి వల్ల 6 వేల కోట్ల రూపాయల మేర ఎన్డీబీ నిధులు మురిగిపోతున్నాయని అన్నారు.

బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏపీకి వద్దంటూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా లేక టీడీపీ అభిప్రాయమా అని ప్రశ్నించారు విష్ణువర్దన్ రెడ్డి. పరిశ్రమలను అడ్డుకునే నిషయంలో వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తూ ఓవైపు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటుంటే, మరో వైపు లేఖలు రాసి టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.

ఏం ఇవ్వాలి..? ఏం ఇస్తామంటున్నారు..?

ఏపీకి అది ఇస్తామన్నాం, ఇది చేస్తామన్నాం, మేం పొడిచేస్తాం, చించేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు బీజేపీ నేతలు. వాటికి టీడీపీ, వైసీపీ అడ్డు అని కథలు చెబుతున్నారు. ఎనిమిదేళ్లుగా విభజన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని బీజేపీకి ఏపీ నాయకులపై విమర్శలు చేసే హక్కుందా..? ఏపీ బీజేపీ నేతలకు రాష్ట్ర అభివృద్ధిపై అంత జాలి ఉంటే.. ముందు విభజన హామీలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడితేవాలి. కానీ అది పక్కనపెట్టి కబుర్లు చెప్పడం ఏపీ బీజేపీ నేతలకు అలవాటైంది. ఏపీ నుంచి డిమాండ్లు వినిపిస్తాయనుకునే లోపే.. ఏపీ నాయకులే నిధులు వద్దంటున్నారంటూ నిందలు వేసి కాలక్షేపం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News