దగ్గుబాటి ప్రకటనకు అర్ధమిదేనా? క్లారిటీ వచ్చేసింది?

వెంకటేశ్వరరావు వైసీపీలోను పురందేశ్వరి బీజేపీలో ఉన్నపుడు కూడా కొన్ని సమస్యలు తలెత్తాయి. భవిష్యత్తులో మళ్ళీ అలాంటి సమస్యలే తలెత్తే అవకాశం ఉందని దగ్గుబాటి దంపతులు అనుకున్నారేమో. అందుకనే తనతో పాటు కొడుకుని కూడా వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరం చేసేశారు. దగ్గుబాటి ప్రకటనతో టీడీపీ-బీజేపీ పొత్తుండదని అనుకోవచ్చా?

Advertisement
Update: 2023-01-15 08:36 GMT

మూడున్నర దశాబ్దాల రాజకీయానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుడ్ బై చెప్పేశారు. బాపట్ల జిల్లాలోని ఇంకొల్లులో ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాల్లో మాట్లాడుతూ.. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. వెంకటేశ్వరరావు రాజకీయాలకు ఇప్పుడు గుడ్ బై చెప్పినా చాలాకాలంగా దూరంగానే ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పర్చూరులో పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుండి క్రియాశీలంగా లేరు. దగ్గుబాటి రాజకీయాలకు గుడ్ బై చెప్ప‌డం పెద్ద విషయమేమీ కాదు.

అయితే తనతో పాటు తన కొడుకు హితేష్ చెంచురామ్ కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లు చేసిన ప్రకటనే సంచలనంగా మారింది. తాజా ప్రకటన ప్రకారం తండ్రి, కొడుకులిద్దరు రాజకీయాలకు దూరమైపోయినట్లే. ఇక్కడ గమనించాల్సిందేమంటే వెంకటేశ్వరరావంటే రాజకీయాలకు దూరమయ్యారంటే అర్ధముంది. కానీ కొడుకు హితేష్ ఇంకా రాజకీయాల్లో అరంగేట్రమే చేయలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే గుడ్ బై చెప్పేయటం ఏమిటో అర్ధంకావటంలేదు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున హితేష్ చీరాలలో పోటీకి రెడీ అవుతున్నారని బాగా ప్రచారం అవుతోంది. తాజా ప్రకటనతో అదంతా అబద్ధమే అని అనుకోవాలి. అయితే ఇంత హఠాత్తుగా హితేష్ కూడా రాజకీయాల నుండి ఎందుకు తప్పుకుంటున్నట్లు? చాలాకాలం దగ్గుబాటి-చంద్రబాబు మధ్య సంబంధాలు ఉప్పునిప్పులాగుండేవి. అలాంటిది మళ్ళీ ఇద్దరూ ఇప్పుడిప్పుడే కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హితేష్ టీడీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. హితేష్ తల్లి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో యాక్టివ్‌గా ఉన్నారు.

టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవటం సాధ్యంకాదని తేలిపోయిందేమో. ఒకవేళ పొత్తుకి అవకాశాలుంటే అప్పుడు హితేష్ టీడీపీ తరపున పోటీచేసినా పురందేశ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండేదికాదేమో. వెంకటేశ్వరరావు వైసీపీలోను పురందేశ్వరి బీజేపీలో ఉన్నపుడు కూడా కొన్ని సమస్యలు తలెత్తాయి. భవిష్యత్తులో మళ్ళీ అలాంటి సమస్యలే తలెత్తే అవకాశం ఉందని దగ్గుబాటి దంపతులు అనుకున్నారేమో. అందుకనే తనతో పాటు కొడుకుని కూడా వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరం చేసేశారు. దగ్గుబాటి ప్రకటనతో టీడీపీ-బీజేపీ పొత్తుండదని అనుకోవచ్చా?

Tags:    
Advertisement

Similar News