ఎన్టీఆర్ ఎపిసోడ్‌తో గందరగోళం.. పవన్‌ని బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నాలు..

ఆ మధ్య అల్లూరి విగ్రహావిష్కరణకు ఏపీకి వచ్చిన మోదీకి, పవన్ అపాయింట్‌మెంట్ లేదు. ఇటీవల తెలంగాణకు వచ్చిన అమిత్ షా.. హీరో ఎన్టీఆర్‌ని పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఇక్కడే జనసైనికులకు కాలింది.

Advertisement
Update: 2022-09-07 08:24 GMT

పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో బీజేపీ పొత్తు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ప్రతిపక్షాలన్నిటినీ కలిపే మాట‌లు మాట్లాడుతున్నారు కానీ, కేవలం జనసేన-బీజేపీ కలసి పనిచేస్తాయని చెప్పడంలేదు. ఈ దశలో అటు బీజేపీలో కూడా గందరగోళం ఉంది. ఆ పార్టీకి టీడీపీతో కలసి నడవటం ఇష్టంలేదు. అలాగని పవన్‌ని వదిలేసుకోనూ లేదు. ఈ సందిగ్ధంలో పవన్‌తో కలసి నడిస్తేనే ఏపీలో మంచిది అనే అభిప్రాయంలో ఉంది బీజేపీ. కానీ ఇటీవలే బీజేపీ చేసిన చిన్న తప్పు ఆ పార్టీపై జనసైనికుల ఆగ్రహానికి కారణమైంది. ఆ మధ్య అల్లూరి విగ్రహావిష్కరణకు ఏపీకి వచ్చిన మోదీకి, పవన్ అపాయింట్‌మెంట్ లేదు. ఇటీవల తెలంగాణకు వచ్చిన అమిత్ షా.. హీరో ఎన్టీఆర్‌ని పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఇక్కడే జనసైనికులకు కాలింది. బీజేపీని వారు తెగ ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్-అమిత్ షా భేటీ టీడీపీలో సెగ రేపింది, ఇటు జనసేనలో పొగ పెట్టింది.

బుజ్జగిస్తున్నారా..?

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు పదే పదే పవన్ కల్యాణ్ ప్రస్తావన తెస్తున్నారు. ఇటీవలే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు లక్ష్మణ్ ఏపీలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని చెప్పారు. తాజాగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఏపీలో పవన్ కల్యాణ్‌తో తమ పొత్తు ఉనికిలోనే ఉందని, ఆ పార్టీతోనే తాము కలసి పోటీ చేస్తామని చెబుతున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంటున్న ఆయన, టీడీపీ మీద కూడా జనంలో సానుకూలత లేదని చెప్పారు. వైసీపీని ఓడించాలంటే అది బీజేపీ-జనసేన కూటమి ద్వారా మాత్రమే సాధ్యమంటున్నారాయన. జనసేనతో కొత్తగా పొత్తు పెట్టుకోవడమేంటని, తాము ఎప్పటి నుంచో భాగస్వామ్యులుగా ఉన్నామని విలేకరుల ప్రశ్నకు సమాధానమిచ్చారు.

పవన్ దూరమవుతారనే భయం ఉందా..?

ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ బీజేపీ కంటే టీడీపీపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు. ఎవరూ బయటపడట్లేదు. సింగిల్‌గా వచ్చే దమ్ములేదా, వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తారంటూ... వైసీపీ ర్యాగింగ్ చేస్తున్నా కూడా భరిస్తున్నారే కానీ పొత్తు విషయం తేల్చడం లేదు పవన్. అలాగని బీజేపీతో తాము పొత్తులో ఉన్నామనే విషయాన్ని కూడా ఎక్కడా ధృవీకరించడం లేదు జనసేనాని. దీంతో బీజేపీయే చొరవ తీసుకుంది. పదే పదే పవన్‌తో తాము పొత్తులో ఉన్నామని, 2024లో ఏపీలో జనసేన - బీజేపీ కలసి పోటీ చేస్తాయని చెబుతోంది. మరి దీనిపై జనసేన నుంచి స్పందన ఉంటుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News