సింగ‌ర్‌ 'మంగ్లీ'కి సలహాదారు పదవి ఇచ్చిన సీఎం జగన్

రెండేళ్లపాటు మంగ్లీ ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారు పదవిలో కొనసాగుతారు. ఆమె తిరుపతికి వచ్చే సమయంలో వాహన సౌకర్యం, వసతి సౌకర్యం కల్పిస్తారు.

Advertisement
Update: 2022-11-22 03:20 GMT

ఏపీలో ప్రస్తుతం సలహాదారు పదవులు ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా ప్రముఖ గాయని మంగ్లీ అలియాస్ స‌త్య‌వ‌తికి ఏపీ ప్రభుత్వం ఓ సలహాదారు పదవి ఇచ్చింది. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి పదవులిస్తూ ప్రోత్సహిస్తున్నారు సీఎం జగన్. ఇప్పుడు మంగ్లీకి కూడా అలాంటి అవకాశమే ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా ఆమెను నియమించారు. అయితే ఈ ఏడాది మార్చిలోనే ఎస్వీబీసీ ఉత్తర్వులు జారీ చేసినా, నాలుగు రోజుల క్రితమే ఆమె ఆ బాధ్యతలు చేపట్టడం విశేషం.

లక్ష రూపాయల జీతం..

సలహాదారు పదవి ఏదయినా లక్ష రూపాయల జీతం ఫిక్స్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇక వీరికి ఇతర సౌకర్యాలు అదనంగా సమకూరుతాయి. రెండేళ్లపాటు మంగ్లీ ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారు పదవిలో కొనసాగుతారు. ఆమె తిరుపతికి వచ్చే సమయంలో వాహన సౌకర్యం, వసతి సౌకర్యం కల్పిస్తారు.

అధికారిక ప్రకటన లేదా..?

అయితే ఈ నియామకంపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. అటు మంగ్లీ కూడా తనకు పదవి వచ్చిన విషయంపై కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన విషయంపై కానీ స్పందించలేదు. ఈనెల 17న తిరుమలకు వచ్చి రెండురోజులపాటు అక్కడే ఉండి శ్రీవారిని దర్శించుకున్నారు గాయని మంగ్లీ. అదే సమయంలో ఆమె ఎస్వీబీసీ బోర్డ్ అడ్వైజర్ గా బాధ్యతలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా అలీని ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమించారు.

Tags:    
Advertisement

Similar News