ఎచ్చెర్ల వైసీపీలో కృష్ణార్జునయుద్ధం.. -వైసీపీ నుంచి నాన్ లోకల్ లీడర్ల ప్రయత్నాలు

ఎమ్మెల్యేగా ఎన్నికైన కిరణ్ ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడం, బాడీ లాంగ్వేజ్ కూడా అహంకారంగా వుండడంతో వైసీపీ నేతలకే కాదు, ప్రజలకీ దూరం అయ్యారు.

Advertisement
Update: 2022-11-28 12:50 GMT

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీపీ మధ్య వర్గపోరు తీవ్రమైంది. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పై తీవ్ర ప్రజావ్యతిరేకత నియోజకవర్గంలో వ్యక్తం అవుతోంది. సొంత పార్టీ నుంచి కూడా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధిష్టానం కూడా ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహంతో నియోజకవర్గంలో ఆయన పనితీరుపై సర్వేలు కూడా చేయించింది. ఇంటా, బయటా అసమ్మతితో ఇబ్బందిపడుతున్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కి అభద్రతాభావం మొదలైందని, అందుకే ఇంట్లో వాళ్లనీ నమ్మడంలేదట.

ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ కూడా తన బావమరిది పిన్నింటి సాయికుమార్ (ఎంపీపీ భర్త)తో వైరం పెంచుకున్నారు. బావాబామ్మర్ది మధ్య కృష్ణార్జునయుద్ధం సాగుతోంది. వాస్తవంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కి ప్రజాసంబంధాలు కొనసాగించడంలో అంత మంచి పేరు లేదు. రణస్థలం ఎంపీపీగా పనిచేసిన తరువాత, 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గొర్లె కిరణ్ పోటీచేసి ఓడిపోయారు. అప్పటికే గ్రామ, మండల స్థాయి రాజకీయాలలో తన కలుపుగోలుతనంతో అందరికీ దగ్గరైన బావమరిది పిన్నింటి సాయి కుమార్..బావ గెలుపు కోసం కృష్ణుడులా వ్యూహాలతో పనిచేశాడు. 2019 ఎన్నికల్లో కిరణ్ ఎమ్మెల్యేగా గెలవడంలో బావమరిది సాయి చాలా కీలకంగా వ్యవహరించారు.

వైసీపీ అధికారంలోకి రావడంతో రణస్థలం ఎంపీపీగా సాయి భార్యని ఎంపిక చేశారు. అనధికారికంగా పిన్నింటి సాయి ఎంపీపీగా అన్ని పనులు చక్కబెడుతుంటారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కిరణ్ ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడం, బాడీ లాంగ్వేజ్ కూడా అహంకారంగా వుండడంతో వైసీపీ నేతలకే కాదు, ప్రజలకీ దూరం అయ్యారు. తన బావకి మాట రాకూదనే కోణంలో ప్రజాసంబంధాలు కొనసాగించడంలో దిట్ట అయిన పిన్నింటి సాయి మండలం నుంచి నియోజకవర్గమంతా చాపకింద నీరులా పాకిపోయారు. వైసీపీ కార్యకర్తలకి కష్టం వచ్చినా, సమస్యలు ఎదురైనా, శుభకార్యాలకు చెప్పినా హాజరవుతూ ప్రజలకి దగ్గరయ్యారు. ఇదే సమయంలో గడప గడపకీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఏ వూరు వెళ్లినా వైసీపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అధిష్టానం కూడా ఎమ్మెల్యే పనితీరుపై వచ్చిన నివేదికలతో ప్రత్యామ్నాయం ఆలోచించడం మొదలు పెట్టింది.

నియోజకవర్గంలో వైసీపీ కేడర్, ప్రజలు, అధిష్టానానికి దూరం అయిన ఆక్రోశంతో బావమరిది సాయి వల్లే ఇదంతా అనే అనుమానాలు పెంచుకున్న ఎమ్మెల్యే కిరణ్ దూరం అయ్యారు. ఇద్దరి మధ్యా మాటలు బంద్ అయ్యాయి. రణస్థలం ఎంపీపీ పరిధి సాయి దాటకూడదని ఆంక్షలు అమలయ్యాయి. బావామరుదల ఈ యుద్ధంతో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను వంటి వారు ఎచ్చెర్ల టికెట్ కే ఎర్త్ పెట్టే ప్రయత్నాల్లో వున్నారు. ఇంటి గుట్టు లంకకి చేటు మాదిరి..బావామరుదల మధ్య పోరు.. ఎచ్చెర్ల ఎమ్మెల్యే టికెట్ కే ఎర్త్ పెట్టే ప్రమాదం కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News