పవన్ కి మద్దతుగా బాబు, లోకేష్.. బీజేపీ సైలెన్స్

జనసేనకు మద్దతుగా చంద్రబాబు, లోకేష్ వరుస ట్వీట్లు వేస్తూ పవన్ ని దువ్వుతున్నారు. అదే సమయంలో మిత్రపక్షం బీజేపీ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన లేదు

Advertisement
Update: 2022-10-16 07:25 GMT

విశాఖ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతల కార్లపై జరిగిన రాళ్ల దాడి, తదనంతర పరిణామాలు తెలిసిందే. ఈ క్రమంలో జనవాణి కార్యక్రమాన్ని కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. జనసేన నాయకుల అరెస్ట్ ని ఖండించారు. వారిని విడుదల చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో పవన్ కి మద్దతుగా టీడీపీ కూడా తెరపైకి వచ్చింది. జనసేన నాయకుల అరెస్ట్ లను ఖండిస్తూ చంద్రబాబు, లోకేష్ వరుస ట్వీట్లు వేశారు. అరెస్ట్ చేసిన జనసేన నాయకులను బేషరతుగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు చంద్రబాబు, లోకేష్. పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ గదుల్లో సోదాలు నిర్వహించడం దారుణం అన్నారు. ఓ నాయకుడు కారులో కూర్చుని అభివాదం చేయాలా, బయటకు వచ్చి ప్రజలకు కనపడాలా అనేది పోలీసులు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు చంద్రబాబు.

బీజేపీ జాడేది.. ?

విశాఖ గర్జన రోజే విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం పెట్టుకుంది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో అంత ఉద్రిక్తత నెలకొన్నా బీజేపీ తరపున అధికారికంగా స్పందన లేదు. విష్ణువర్దన్ రెడ్డి మినహా ఇంకెవరూ దీనిపై సీరియస్ గా స్పందించలేదు. కనీసం బీజేపీ ఏపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కానీ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నుంచి కానీ స్పందన లేకపోవడం విశేషం. అదే సమయంలో టీడీపీ మాత్రం పవన్ ని దువ్వడానికి వరుస ట్వీట్లు వేస్తూ జనసైనికులకు తామున్నామనే భరోసా కల్పించింది.

విశాఖ ఎపిసోడ్ తో ఎవరికి లాభం.. ?

విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటనతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశాన్ని పక్కనపెడితే.. విశాఖ గర్జన కంటే ఎక్కువగా ఎయిర్ పోర్డ్ దాడి వ్యవహారం హైలెట్ అయింది. జనసేన నాయకుల అరెస్ట్ తో అది మరింత రచ్చగా మారింది. పవన్ కల్యాణ్ పై వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. మూడు రాజధానుల వ్యవహారం కాస్తా ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయింది. సందట్లో సడేమియా లాగా టీడీపీ ఎంట్రీ ఇచ్చింది, జనసేనకు మద్దతు తెలిపింది. ఈ వ్యవహారం ఇంకే మలుపు తిరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News