రాజకీయం అవసరమే లేదా?

చంద్రబాబు మాట, చేత అంతా రాజకీయమే. తనకు రాజకీయం అవసరంలేదని చెప్పటమే అసలైన రాజకీయం. ఊపిరి తీసుకోకుండా అయినా ఉండగలరేమో కానీ రాజకీయం చేయకుండా మాత్రం ఉండలేరు.

Advertisement
Update: 2023-09-06 05:33 GMT

‘నాకు రాజకీయం అవసరమే లేదు..జగన్మోహన్ రెడ్డి నుండి ప్రజలను కాపాడటమే నా కర్తవ్యం’ ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. రాయదుర్గం బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ..సైకో పనైపోయింది జగన్ గెలిచే ప్రశక్తే లేదన్నారు. చంద్రబాబు మాట, చేత అంతా రాజకీయమే. తనకు రాజకీయం అవసరంలేదని చెప్పటమే అసలైన రాజకీయం. ఊపిరి తీసుకోకుండా అయినా ఉండగలరేమో కానీ రాజకీయం చేయకుండా మాత్రం ఉండలేరు. అలాంటిది తనకు రాజకీయం అవసరం లేదని చెప్పటం పెద్ద అబద్ధం.

నిజంగానే చంద్రబాబుకు రాజకీయం అవసరం లేదంటే టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరిని చేస్తారో ప్రకటించగలరా? తన పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేదా పుత్రరత్నం లోకేష్ ఇద్దరిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా ఇపుడే ప్రకటించగలరా? ఆ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ కౌరవసభ లాంటి అసెంబ్లీలో తాను ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని చేసిన శపథం మాటేమిటి?

అప్పట్లో ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలోకి అడుగుపెడతానని చేసిన శపథం రాజకీయం కాదా? జగన్‌ను ఓడించటమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలని ప్రయత్నించటం, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడటాన్ని ఏమంటారు? ఒకవైపు జగన్‌కు వ్యతిరేకంగా 24 గంటలూ రాజకీయం చేస్తునే తనకు రాజకీయం అవసరంలేదని చెప్పటం చంద్రబాబుకే చెల్లింది. ముందస్తు ఎన్నికలు వచ్చినా, జమిలి ఎన్నికలు వచ్చినా టీడీపీ దేనికైనా సిద్ధమే అని ప్రకటించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 175 నియోజకవర్గాలన్నింటిలో పోటీ చేసేందుకు గట్టి అభ్యర్థులు లేరు. లోకేష్ గతంలో చెప్పినట్లుగానే 40 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు లేరు. పొత్తుల విషయం ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలీదు, ఎన్ని సీట్లు వదులుకోవాలో తెలియ‌క‌ అయోమయంలో ఉన్నారు. అలాంటిది జమిలి ఎన్నికలు వచ్చినా, ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధమే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. జగన్ సైకో అని, శాడిస్ట్ అని చెప్పాల్సింది చంద్రబాబు కాదు అనుకోవాల్సింది జనాలు. అప్పుడే చంద్రబాబు వైపు జనాలు చూస్తారు లేకపోతే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ శ్రమంతా వృధానే.


Tags:    
Advertisement

Similar News