పవన్ కన్నా చంద్రబాబుకే ఎక్కువ సమస్యా?

పవన్‌తో పోల్చుకుంటే చంద్రబాబుకే పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పటికే మోడీ దెబ్బేంటో చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అలాంటిది మళ్ళీ రెండోసారి మోడీని ఎదిరించేంత సాహసం చంద్రబాబు చేయలేరు.

Advertisement
Update: 2022-11-14 09:50 GMT

నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ తర్వాత అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడింది. మోడీ - పవన్ భేటీ తర్వాత ఒక విషయంపై అందరికీ క్లారిటి వచ్చేసింది. అదేమిటంటే పవన్ చేసిన ఏ ప్రతిపాదనను మోడీ అంగీకరించలేదని. పవన్ చేసిన ప్రతిపాదన ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును కూడా కలుపుకుని ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని. అయితే అందుకు మోడీ ఏమాత్రం అంగీకరించలేదని సమాచారం.

బీజేపీ, జనసేన మాత్రమే పోరాటాలు చేయాలని రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలన్నట్లుగా పవన్‌కు మోడీ చెప్పారట. అంటే చంద్రబాబును కలుపుకుని వెళ్ళే విషయంలో మోడీ వైఖరి ఏమిటో తాజా భేటీలో స్పష్టమైపోయింది. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు భవిష్యత్ రాజకీయాలు ఎలాగుంటాయనే విషయంలో చర్చలు మొదలయ్యాయి. ఇక్కడ విషయం ఏమిటంటే బీజేపీతో కలిసుండటం పవన్‌కు ఇష్టంలేదు. ఇదే సమయంలో పవన్ మనసంతా చంద్రబాబుతో నడవటంపైనే ఉంది.

అయితే మోడీతో జరిగిన తాజా భేటీ తర్వాత కూడా బీజేపీని పవన్ వదిలేసేంత ధైర్యం చేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ బీజేపీని వదిలేసి చంద్రబాబుతో చేతులు కలిపితే అప్పుడు పర్యవసానాలు ఎలాగుంటాయి? తమను కాదని వెళ్ళిపోయిన పార్టీలను బీజేపీ అంత తేలిగ్గా వదిలిపెట్టడంలేదు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ విషయం అర్ధమైపోతుంది. మరి ఇక్కడ తమను కాదని వెళ్ళిపోయిన పవన్ పరిస్ధితి ఎలాగుంటుంది? దగ్గరకు తీసుకున్న చంద్రబాబు పరిస్ధితి ఏమౌతుందనే విషయమై చర్చలు మొదలయ్యాయి.

పవన్‌తో పోల్చుకుంటే చంద్రబాబుకే పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పటికే మోడీ దెబ్బేంటో చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అలాంటిది మళ్ళీ రెండోసారి మోడీని ఎదిరించేంత సాహసం చంద్రబాబు చేయలేరు. మోడీని కాదని తన దగ్గరకు వచ్చిన పవన్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని ఎవరు అనుకోవటంలేదు. ఒకవేళ పవన్‌తో పొత్తు పెట్టుకుంటే ఏమి జరుగుతుందో అందరికన్నా చంద్రబాబుకే బాగా తెలుసు. కాబట్టి కనీసం ఎన్నికలకు ముందువరకు అయినా పవన్‌తో కలవరనే టాక్ నడుస్తోంది. అందుకనే అందరి దృష్టి చంద్రబాబు వేయబోయే అడుగుపైనే ఉంది.

Tags:    
Advertisement

Similar News