బీజేపీ నమ్మకాన్నే చంద్రబాబు నిజం చేస్తున్నారా?

2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డే గెలిస్తే తర్వాత టీడీపీ ఉండదని. కాబట్టి వచ్చే ఎన్నికలను సింపుల్‌గా వైసీపీకి వదిలేసినా 2029 ఎన్నికల నాటికి జనసేన మిత్రపక్షంగా బీజేపీ బలపడుతుందనేది కమలనాథుల‌ లాజిక్.

Advertisement
Update: 2022-11-18 07:12 GMT

బీజేపీ నమ్మకాన్నే చంద్రబాబు నాయుడు నిజం చేయబోతున్నట్లున్నారు. చంద్రబాబు గురించి బీజేపీలో ఒక విషయం బాగా చర్చ జరుగుతోంది. అదేమిటంటే 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డే గెలిస్తే తర్వాత టీడీపీ ఉండదని. కాబట్టి వచ్చే ఎన్నికలను సింపుల్‌గా వైసీపీకి వదిలేసినా 2029 ఎన్నికల నాటికి జనసేన మిత్రపక్షంగా బీజేపీ బలపడుతుందనేది కమలనాథుల‌ లాజిక్. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ పూర్తిగా బలహీనపడిపోతుందని నేతల్లో చాలా మంది వేరే దారి లేక బీజేపీలోకి వచ్చేస్తారని కమలనాథులు అంచనాలు వేస్తున్నారు.

ఈ అంచనాల్లోను, చర్చల్లోను రహస్యమేమీలేదు. బీజేపీ నేతలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. మొన్నటి రెండు రోజుల పర్యటనలో నరేంద్ర మోడీ కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఈ విషయమే హితబోధ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలనే ఉద్దేశంతో ఆవేశపడి ఆయాసం తెచ్చుకోవద్దని మోడీ చెప్పారట. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ ఎలాగూ ఉండదు కాబట్టి వైసీపీకి మిత్రపక్షాలే అసలైన ప్రతిపక్షాలవుతాయని అన్నారట.

కాబట్టి వచ్చే ఎన్నికలను వైసీపీ-టీడీపీ మధ్య జరగనిస్తే సరిపోతుందని మోడీ వివరించి చెప్పారట. ఇపుడిదంతా ఎందుకంటే బీజేపీ నేతలు అనుకుంటున్న మాటలే స్వయంగా చంద్రబాబు నోటి వెంటవచ్చాయి. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు కాబట్టి కచ్చితంగా ఓట్లేసి టీడీపీని గెలిపించమని జనాలను బతిమలాడుకుంటున్నారు. జనాలు ఓట్లేయకపోతే తాను ఇంట్లోనే కూర్చోవాల్సొస్తుందన్నారు. చంద్రబాబు మాటలు, బాడీ ల్యాంగ్వేజ్ చూస్తుంటే ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించేశారా అనే టాక్ పెరిగిపోతోంది. నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు ముందు చంద్రబాబు ఎప్పుడూ ఇలాగ మాట్లాడలేదు.

మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవటం, తర్వాత పవన్ వైఖరిలో మార్పు రావటం అందరు చూస్తున్నదే. అప్పటివరకు జనసేనతో టీడీపీ పొత్తు ఖాయమని జరిగిన ప్రచారమంతా ఒక్కసారిగా రివర్సయిపోయింది. టీడీపీకి ఒంటరి పోరాటం తప్పదని అలాగే ఓటమీ తప్పదని చంద్రబాబు ఫిక్సయిపోయారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ టెన్షన్‌తోనే తానేం మాట్లాడుతున్నారో కూడా తెలికుండా బేలగా మాట్లాడారు. ఇందుకనే బీజేపీ నమ్మకాన్నే చంద్రబాబు నిజం చేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News