బాబు పర్యటనలో ఢీకొన్న పడవలు, నీటిలోకి టీడీపీ నేతలు

ఒడ్డుకు దగ్గరల్లోనే ప్రమాదం జరగడంతో కార్యకర్తలు, మత్స్యకారులు అప్రమత్తమై నేతలను ఒడ్డుకు చేర్చారు. చంద్రబాబు పెద్ద పడవలో ఉండడంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.

Advertisement
Update: 2022-07-21 15:23 GMT

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కోనసీమ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పడవల్లో టీడీపీ నేతలు బయలుదేరారు. కాసేపటికి రెండు పడవలు ఢీకొన్నాయి. దాంతో దేవినేని ఉమా, ఉండి ఎమ్మెల్యే రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ తదితరులు గోదావరిలోకి పడిపోయారు. మాజీ మంత్రి పితాని నీటిలో పడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. బయలుదేరిన కాసేపటికే పడవలు ఢీకొనడం, ఒడ్డుకు దగ్గరల్లోనే ప్రమాదం జరగడంతో కార్యకర్తలు, మత్స్యకారులు అప్రమత్తమై నేతలను ఒడ్డుకు చేర్చారు. చంద్రబాబు భద్రతా సిబ్బందిలోని కొందరు కూడా నీటిలో పడిపోయారు. చంద్రబాబు పెద్ద పడవలో ఉండడంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.

కోర్టుకైనా వెళ్లి అండగా ఉంటా - చంద్రబాబు

వరద విపత్తు నిర్వాహణలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. ముందస్తు ప్రణాళిక లేకుండాపోవడంతో ప్రజలు ఇప్పుడు శాపనార్థాలు పెడుతున్నారని చంద్రబాబు చెప్పారు. తాను ఊహించిన దాని కంటే భయంకరంగా పరిస్థితి ఉందన్నారు. భోజనం పెట్టాలన్న ధ్వాస కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి ఒకసారి మాత్రమే భోజనం పెట్టారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు పది వేలు ఇచ్చి.. అక్కడి మంత్రులు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తుంటే ఇక్కడ వైసీపీ ప్రజాప్రతినిధులు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. తను వస్తే ఇబ్బందుల గురించి చెప్పవద్దంటూ వలంటీర్లను పంపి బాధితులను అధికారులు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయలు బురద కడుక్కోవడానికి కూడా సరిపోదన్నారు. ఇంటికి రూ.10వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బాధితులను బెదిరించినా, కక్ష కట్టినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి బాధితులకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం బెదిరిస్తే రెండు రోజులు భయపడుతారేమో గానీ, వారంతా తిరగబడే రోజు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ప్రభుత్వం ఆలోచించుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. రియల్ టైం వ్యవస్థను భ్రష్టు పట్టించారని.. అందుకే వరదను అంచనా వేయలేకపోయారన్నారు.

Tags:    
Advertisement

Similar News