నిలదీసేంత ధైర్యం కూడా లేదా?

పవన్ వైఖరిపై బీజేపీ నేతలు లోలోపల మండిపోవటం తప్ప బహిరంగంగా చేయగలిగింది కూడా ఏమీలేదు. ఎందుకింత సైలెంట్‌గా ఉంటున్నారంటే గట్టిగా అడిగితే తమతో పొత్తును పవన్ ఎక్కడ వదిలేసుకుంటారో అనే భయం ఉన్నట్లుంది.

Advertisement
Update: 2023-01-09 06:48 GMT

అడకత్తెరలో పోకచెక్క పరిస్ధితి అంటే బీజేపీని చూస్తే అర్ధమైపోతుంది. తన మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ‌త్రుప‌క్షం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయినా గట్టిగా ఒక మాట కూడా మాట్లాడలేకపోతోంది. చంద్రబాబు-పవన్ మధ్య ఇది రెండో భేటీ. అప్పట్లో వైజాగ్‌లో పవన్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి పరామర్శ పేరుతో చంద్రబాబు వెళ్ళి హోటల్లో భేటీ అయ్యారు.

ఇప్పుడు కుప్పంలో చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురయ్యాయనే సాకుతో పవన్ వెళ్ళి చంద్రబాబు ఇంట్లో భేటీ అయ్యారు. విచిత్రం ఏమిటంటే రెండు సార్లు కూడా జరుగుతున్న చోద్యాన్ని బీజేపీ నేతలు చూస్తు కూర్చున్నారే కానీ గట్టిగా పవన్ను నిలదీయలేకపోతున్నారు. తమ శ‌త్రుపక్షం అధినేత చంద్రబాబుతో భేటీలు ఎందుకు జరుపుతున్నారని నిలదీసేంత సీన్ కూడా కమలనాథుల్లో లేకపోవటమే చాలా విచిత్రంగా ఉంది. తమకు ఇష్టం లేక‌పోయినా చంద్రబాబుతో భేటీ జరుపుతుండటాన్ని మరి బీజేపీ నేతలు ఎలా చూస్తున్నారో కూడా తెలియ‌డం లేదు.

పవన్ వైఖరిపై బీజేపీ నేతలు లోలోపల మండిపోవటం తప్ప బహిరంగంగా చేయగలిగింది కూడా ఏమీలేదు. ఎందుకింత సైలెంట్‌గా ఉంటున్నారంటే గట్టిగా అడిగితే తమతో పొత్తును పవన్ ఎక్కడ వదిలేసుకుంటారో అనే భయం ఉన్నట్లుంది. మామూలుగా అయితే మిగిలిన రాష్ట్రాల్లో తమను వదిలేసి వెళ్ళిన పార్టీలను బీజేపీ దుంపనాశనం చేస్తోంది. కానీ ఏపీలో మాత్రం పార్టీ పరిస్థితి రివ‌ర్స్‌లో న‌డుస్తోంది. కారణం ఏమిటంటే పార్టీ పరిస్థితి జీరో కావటమే.

బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పది ఓట్లు రావాలంటే పవన్‌తో కలిసుండటం ఒకటే మార్గమని వాళ్ళకి బాగా అర్ధమైపోయింది. పోయిన ఎన్నికల్లో బీజేపీకి కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. వచ్చే ఎన్నికల్లో పరిస్ధితి ఇంతకన్నా భిన్నంగా ఉంటుందని కూడా అనుకోవటం లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుపు సంగతి పక్కనపెట్టేసి గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకోవాలంటే పవన్‌తో పొత్తు ఒకటే మార్గమని బీజేపీ నేతలు గట్టిగా ఫిక్సయినట్లున్నారు. అందుకనే చంద్రబాబుతో భేటీ అవటం తమకు ఇష్టం లేకపోయినా పవన్‌ను ఏమీ అనలేని దీనస్థితిలో ఉండిపోయారు.

Tags:    
Advertisement

Similar News