జనసేన నాయకుల అరెస్ట్.. పవన్ వార్నింగ్..

రాళ్లదాడి వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు జనసేన నాయకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ కి వెళ్లి జనసేన నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Update: 2022-10-16 01:28 GMT

గర్జన తర్వాత విశాఖ గరం గరంగా మారింది. వైసీపీ మంత్రులు, నాయకుల కార్లపై దాడి అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పవన్ కల్యాణ్ విశాఖ ఎంట్రీతో వైసీపీ, జనసేన నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత పెరిగాయి. సాక్షాత్తూ మంత్రుల కార్లపైనే రాళ్లదాడి జరగడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనసేన నాయకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ కి వెళ్లి మరీ జనసేన నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం..

అర్ధ‌రాత్రి అరెస్ట్ ల తర్వాత పవన్ కల్యాణ్ కూడా సీరియస్ గా స్పందించారు. జనసైనికులను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. పోలీసుల భద్రతా వైఫల్యానికి జనసేన నాయకులను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే తమవాళ్లని విడుదల చేయాలని, లేదంటే పోలీస్ స్టేషన్ ని ముట్టడిస్తామంటూ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. డీజీపీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలన్నారు పవన్. అటు పోలీసులు కూడా పక్కా ఆధారాలతోనే జనసేన నాయకుల్ని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుల్ని గుర్తించామంటున్నారు.

నేడు జనవాణి జరుగుతుందా..?

పవన్ కల్యాణ్ మూడురోజుల ఉత్తరాంధ్ర పర్యటన శనివారంతో మొదలైంది. ఆదివారం జనవాణి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. వైసీపీ నేతలపై దాడి, జనసేన నాయకుల అరెస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది. నాయకుల అరెస్ట్ కోసం పవన్ రోడ్డుపైకి వచ్చే అవకాశముంది. ఇది మరో గొడవకు దారితీసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనవాణి కార్యక్రమం మరుగున పడిపోయి, జనసేన అరెస్ట్ ల వ్యవహారం హైలెట్ గా మారింది. పవన్ సహా, నాదెండ్ల, నాగబాబు కూడా తగ్గేదే లేదంటున్నారు. అక్రమంగా జనసేన నాయకుల్ని అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. విశాఖకు భారీగా తరలి వచ్చిన జనసైనికులు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం గర్జన, ఆదివారం ఆందోళనలతో ఈ వీకెండ్ విశాఖలో సెగలు పుట్టిస్తోంది.

Tags:    
Advertisement

Similar News