బాబు లాయర్లు.. ఆయన నేరం చేయలేదని చెప్పట్లేదు

టెక్నికల్‌ అంశాలపైనే చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు తప్ప.. నేరం చేయలేదని చెప్పడం లేదన్నారు. గతంలోనే అనేక సార్లు విచారణల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారని ఆయన చెప్పారు.

Advertisement
Update: 2023-10-10 13:35 GMT

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో కోర్టులో చంద్రబాబు తరఫున వాదిస్తున్న లాయర్లు.. ఆయన నేరం చేయలేదని చెప్పడం లేదని, చట్టంలో లొసుగుల కోసం వెతుకులాడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దొంగలు దొరికిపోయారని ప్రజలకు తెలిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తెలిపారు.

టెక్నికల్‌ అంశాలపైనే చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు తప్ప.. నేరం చేయలేదని చెప్పడం లేదన్నారు. గతంలోనే అనేక సార్లు విచారణల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం సీఐడీ అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్‌ చేసిందని, దొంగ అన్నిసార్లు తప్పించుకోలేడనే విషయం చంద్రబాబు విషయంలో రుజువైందని మంత్రి అంబటి చెప్పారు.

చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌ కూడా దొరికిపోయాడని ప్రజలకు అర్థమవుతోందని మంత్రి అంబటి చెప్పారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి బంధుత్వ ప్రేమతో ఆరాటపడుతున్నారని, ఆమె తన మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అంబటి విమర్శించారు. చంద్రబాబును కాపాడేందుకే పురందేశ్వరి ఢిల్లీ వెళ్లారని ఆయన చెప్పారు. మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలను పురందేశ్వరి ఖండించలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

పవన్‌ కల్యాణ్‌ పీకే కాదని కేకే అని చెప్పిన అంబటి.. కేకే అంటే కిరాయి కోటిగాడిలా తయారయ్యాడని వివరించారు. కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మేందుకే పవన్‌ పార్టీ పెట్టారని మంత్రి అంబటి దుయ్యబట్టారు.

Tags:    
Advertisement

Similar News