ముందు రోజే కీలక నేత ఇంట్లో కుట్ర రచన - నాదెండ్ల

విశాఖలో పవన్ కల్యాణ్‌పై దాడి కోసం.. ఆ ముందు రోజే విశాఖలోని ఒక వైసీపీ ముఖ్యనాయకుడి ఇంట్లో వ్యూహరచన జరిగింద‌ని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

Advertisement
Update: 2022-10-31 02:50 GMT

టీడీపీ హయాంలోనే కాదు ఇప్పుడు కూడా తన చుట్టూ ఏదో భారీ కుట్ర జరిగిపోతోందని భావిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల విశాఖపట్నంలో మంత్రులపై జనసేన కార్యకర్తల దాడి, ఆ తర్వాత పోలీసుల తీసుకున్న చర్యలపైనా పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు కుట్ర వ్యాఖ్యలు చేశారు.

విశాఖ జనవాణి కార్యక్రమం జరగకుండా అడ్డుకునేందుకు తన పర్యటనలో ప్రభుత్వం విధ్వంసం సృష్టించబోతోందని తనకు ఐదు రోజుల ముందే తెలుసని చెప్పారు పవన్‌ కల్యాణ్. అయినా సరే భయపడి ఇంట్లో కూర్చోకూడదనే విశాఖ వెళ్లానని చెప్పారు. మంత్రులపై దాడి చేసి అరెస్ట్ అయి, బెయిల్‌పై బయటకు వచ్చిన జనసేన నేతలను పవన్ కల్యాణ్ సన్మానించారు.

నాదెండ్ల మనోహర్ మరో అడుగు ముందుకేసి విశాఖలో పవన్ కల్యాణ్‌పై దాడి కోసం.. ఆ ముందు రోజే విశాఖలోని ఒక వైసీపీ ముఖ్యనాయకుడి ఇంట్లో వ్యూహరచన జరిగింది ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌పై దాడి చేయాలన్న ఉద్దేశంతోనే ర్యాలీ సందర్భంగా వీధి లైట్లు ఆపేశారని, ఒక పోలీసు అధికారి పవన్‌ కల్యాణ్‌ కారులో ఎక్కి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని నాదెండ్ల చెప్పారు.

పవన్‌కు ఐపీఎస్ అధికారి అడ్డంకులు సృష్టిస్తే అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు రెచ్చిపోతారని.. అప్పుడు కిరాయి మూకలతో దాడి చేయించాలన్న పన్నాగం సిద్ధం చేసుకున్నారని.. కానీ పవన్ కల్యాణ్ రెచ్చిపోకుండా సంయమనం పాటించడంతో ఆ వ్యూహం ఫలించలేదన్నారు.

అరెస్ట్‌ అయిన జనసేన నేతలను పేరుపేరున పక్క గదిలోకి తీసుకెళ్లి బట్టలు ఊడదీసి బెల్టుతో కొట్టారని నాదెండ్ల ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని వివరించారు. అవసరమైతే తామే చొరవ తీసుకుని అన్ని పక్షాలను ఏకం చేస్తామని ప్రకటించారు.

పవన్‌ కల్యాణ్‌పై విశాఖలో దాడికి ప్రణాళిక రచించారన్న విషయంలో కొందరి ఫోన్ సంభాషణల ద్వారా ఢిల్లీ వర్గాలు ముందే తెలుసుకుని.. జనసేన నాయకత్వాన్ని అప్రమత్తం చేశాయంటూ ఒక వీడియోను కూడా సమావేశంలో జనసేన ప్రదర్శించింది.

Tags:    
Advertisement

Similar News