వైసీపీలో 27మంది కాపు ఎమ్మెల్యేలు.. పవన్ నీ బలమెంత..?

విజయవాడలో తిరిగినప్పుడు పవన్ పై ఎప్పుడూ ఎక్కడా దాడి జరగలేదని, ఇప్పుడు కొత్తగా దాడికి కుట్రలు అంటూ జనసేన వితండవాదం చేస్తోందని మండిపడ్డారు పేర్నినాని. అనుమతి లేకుండా విశాఖలో పవన్ ర్యాలీ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు.

Advertisement
Update: 2022-10-31 02:46 GMT

అత్యథికంగా 27 మంది కాపు ఎమ్మెల్యేలున్న పార్టీ వైసీపీయేనని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కల్యాణ్ బలమేంటో, జనసేనకు ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో ప్రజలకు తెలుసన్నారు. పవన్ కల్యాణ్ మైకులముందే పోరాటం చేస్తారని విమర్శించారు. పవన్ దిగజారిపోయి చంద్రబాబుతో లాలూచీ పడ్డారని ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చేసిన తీర్మానాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు నాని. ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడాల్సింది పోయి, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా జనసేన పీఏసీ మీటింగ్ జరిగిందని అన్నారు.

దాడి చేసిన వారికి సన్మానాలా..?

మహిళా మంత్రులపై దాడి చేసినవారికి సన్మానాలు చేసిన ఘనత ఒక్క పవన్ కల్యాణ్ కే దక్కుతుందని విమర్శించారు పేర్ని నాని. గతంలో కోనసీమ అల్లర్ల సమయంలో మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన వారిలో కూడా జనసేన నాయకులు ఉన్నారని, ఇలాంటి హింసాత్మక ఘటనలను జనసేన ప్రోత్సహించడం సరికాదన్నారు. హింసకు పాల్పడినవారికి మద్దతుగా తీర్మానాలు ప్రవేశ పెట్టడమేంటని ప్రశ్నించారు.

పవన్ పై దాడికి కుట్రలు అవసరమా..?

పవన్ పై దాడి చేయడానికి కుట్రలు చేస్తున్నారంటూ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఘాటుగా స్పందించారు పేర్ని నాని. పవన్ కల్యాణ్‌ పై దాడికి కుట్రలు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఆయన విజయవాడ ఎన్నిసార్లు వచ్చారో తెలియదా అని ప్రశ్నించారు. పార్టీ ఆఫీస్ నుంచి నోవాటెల్ హోటల్ కు ఎన్నిసార్లు తిరిగాడో జనసేన నేతలే చెప్పాలన్నారు. విజయవాడలో తిరిగినప్పుడు పవన్ పై ఎప్పుడూ ఎక్కడా దాడి జరగలేదని, ఇప్పుడు కొత్తగా దాడికి కుట్రలు అంటూ జనసేన వితండవాదం చేస్తోందని మండిపడ్డారు. అనుమతి లేకుండా విశాఖలో పవన్ ర్యాలీ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. వైసీపీ బీసీ నేతల సమావేశానికి ఇతర సామాజిక వర్గాల నేతలు వస్తే తప్పేంటని, వరంగల్‌లో చంద్రబాబు బీసీ గర్జన పెట్టి సోనియా గాంధీని ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు పేర్ని నాని. ప్రజలకు ఏం చేయాలనే విషయంపై చర్చించకుండా దాడులు చేసిన వారికి మద్దతు తెలిపేందుకే జనసేన పీఏసీ మీటింగ్ పెట్టి తీర్మానాలు చేసిందని మండిపడ్డారు.

Advertisement

Similar News