జోరుగా వర్షం.. అయినా ఆగని సీఎం జగన్ పర్యటన

మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలి అంటూ పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని ఆయన భరోసా ఇచ్చారు.

Advertisement
Update: 2022-07-26 10:59 GMT

ఒకవైపు జోరుగా వర్షం.. మరోవైపు వాహనాలు వెళ్లలేని బురద. అయినా ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పర్యటనను ఆపలేదు. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చిన జగన్.. వర్షాన్ని లెక్కచేయకుండా ముందుకు సాగారు. తాడేపల్లి నుంచి పి. గన్నవరం మండలం జి. పెదపూడికి ముందుగా చేరుకున్నారు. ఆ సమయంలో పెదపూడిలో భారీ వర్షం పడుతోంది. వర్షంలో పర్యటన వద్దు.. కాసేపు ఇక్కడే ఆగుదామని స్థానిక నేతలు జగన్‌కు చెప్పారు. అయినా సరే ఆయన ఆగలేదు. వర్షంలోనే వరద బాధితులను పరామర్శించారు.

ముందు ట్రాక్టర్ ఎక్కి గోదావరి వద్దకు చేరుకున్న ఆయన.. అక్కడ నుంచి ప్రత్యేక పంటు ఎక్కి ముంపు గ్రామాల సందర్శనకు వెళ్లారు. గోదావరి వరద బాధితులను పరామర్శించి.. వారితో కాసేపు ముచ్చటించారు. వరదల వల్ల కలిగిన నష్టం, ప్రభుత్వం అందించిన సాయం గురించి వాకబు చేశారు. అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రతీ ఒక్కరినీ ఆయన నేరుగా కలసి మాట్లాడటం వారిలో ధైర్యాన్ని కలిగించింది. కాగా, ఇటీవల వరదలకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 51 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

బాధితులకు అండగా ఉంటాం : సీఎం జగన్

వరద బాధితులందరికీ అండగా ఉంటామని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. అరిగెలవారిపేటలో బాధితులతో ఆయన ముఖాముఖి చర్చ నిర్వహించారు. నేను వరద సమయంలో ఇక్కడకు వస్తే.. అధికారులందరూ నా చుట్టూ తిరిగే వాళ్లు. అందుకే మీకు అధికారులు అందుబాటులో ఉండాలనే నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలి అంటూ పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని ఆయన భరోసా ఇచ్చారు.

జి.పెదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీజన్ ముగియక ముందే వరద నష్టానికి సంబంధించిన సాయం అందిస్తామని చెప్పారు. అధికారులు, వలంటీర్లు ఎలా పని చేస్తున్నారు.? బాధితులందరికీ సాయం ఎలా అందుతోందనే విషయాన్ని కూడా ఆయన తెలుసుకున్నారు. చాలా దూరం ఆయన కాలినడకనే బాధితులను పరామర్శిస్తూ ముందుకు సాగారు.

వలంటీర్లు బాగా పని చేశారు..

వరద సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తమను బాగా చూసుకున్నారని, వలంటీర్లు బాగా పని చేశారని బాధితులు సీఎం జగన్‌కు చెప్పారు. మీ కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయవచ్చు అని జగన్ ప్రశ్నించారు. వరదలు రాగానే ఆయన తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టారని.. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూసుకున్నారని వారు వెల్లడించారు. జగన్ ఈ పర్యటనలో పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంక గ్రామాల్లో కూడా పర్యటించారు.

Tags:    
Advertisement

Similar News