పంతం నెగ్గించుకుని.. తిరిగి పీసీసీ పీఠంపైకి సిద్ధూ..

పంజాబ్ కాంగ్రెస్ లో సిద్ధూ వ్యవహారం టీకప్పులో తుఫానుగా మారిపోయింది. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ సాధారణ కార్యకర్తగానే ఉంటానంటూ ఇటీవల కలకలం రేపారు. ఆ తర్వాత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ ఆయన్ను సముదాయించినా రాజీనామా లేఖను మాత్రం వెనక్కు తీసుకోలేదు. సిద్ధూ మెత్తబడినట్టే కనిపించినా అధిష్టానం అండదండలకోసం ఆయన ఇప్పటి వరకూ వేచి చూశారు. చివరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ హరీష్ రావత్ మంత్రాంగం ఫలించింది. సిద్ధూ […]

Advertisement
Update: 2021-10-15 19:31 GMT

పంజాబ్ కాంగ్రెస్ లో సిద్ధూ వ్యవహారం టీకప్పులో తుఫానుగా మారిపోయింది. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ సాధారణ కార్యకర్తగానే ఉంటానంటూ ఇటీవల కలకలం రేపారు. ఆ తర్వాత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ ఆయన్ను సముదాయించినా రాజీనామా లేఖను మాత్రం వెనక్కు తీసుకోలేదు. సిద్ధూ మెత్తబడినట్టే కనిపించినా అధిష్టానం అండదండలకోసం ఆయన ఇప్పటి వరకూ వేచి చూశారు. చివరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ హరీష్ రావత్ మంత్రాంగం ఫలించింది. సిద్ధూ తన రాజీనామా వెనక్కి తీసుకుని పంజాబ్ పీసీసీ చీఫ్ గా కొనసాగేందుకు ఒప్పుకున్నారు.

మంత్రి వర్గంలో మార్పులు తప్పవా..?
పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ కి ఉద్వాసన పలికి చరణ్ జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిని చేసిన అధిష్టానం, సిద్ధూ వర్గానికి ప్రాముఖ్యతనివ్వడంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసింది. చరణ్ జీత్ మంత్రి వర్గంలో కొంతమందికి కీలక పదవులు దక్కడం కూడా సిద్ధూకి ఇష్టంలేదు. పంజాబ్ డీజీపీ సహా.. ఇతర అధికారుల విషయంలో కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో రాజీనామా అస్త్రాన్ని బయటకు తీశారు.

వచ్చే ఏడాది జరగాల్సిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవసాయ చట్టాలు కీలక పాత్ర పోషిస్తాయనే అంచనాలున్నాయి. బీజేపీపై రోజు రోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది, అనూహ్యంగా అది కాంగ్రెస్ కి లాభసాటిగా మారింది. అయితే అమరీందర్ సింగ్ తో అది సాధ్యం కాదని భావించిన అధిష్టానం దళిత ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీని తెరపైకి తెచ్చింది. అటు పీసీసీ చీఫ్ గా సిద్ధూని నియమించి.. జోడు గుర్రాల స్వారీకి సిద్ధమైంది. ఈ దశలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులతో సిద్ధూ అలిగారు. అయితే ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించుకున్నారు. ఢిల్లీలో రాహుల్ తో భేటీ అయిన ఆయన పంజాబ్ లో తన ప్రయారిటీ తగ్గితే కుదరదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గట్టి హామీ ఇవ్వడం వల్లే సిద్ధూ వెనక్కి తగ్గారు. సిద్ధూ ఎపిసోడ్ తో.. ఒకరకంగా సీఎం చరణ్ జీత్ కి కూడా అధిష్టానం చిన్న హెచ్చరిక పంపించినట్టయింది. పంజాబ్ ప్రభుత్వంపై అనధికారికంగా సిద్ధూ పెత్తనం ఖరారైంది.

Tags:    
Advertisement

Similar News