సెల్‌ ఫోన్‌ టవర్ల రేడియేషన్‌ హానికరం కాదా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ల వల్ల పిచ్చుకలు కనుమరుగయ్యాయని, పలు జాతుల పక్షులు అంతరించిపోతున్నాయని, ఆ రేడియేషన్ మనుషులకు కూడా హాని కలిగిస్తుందని ఇప్పటి వరకూ చాలామంది నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. సెల్ టవర్ల రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు వస్తాయని, క్యాన్సర్ కూడా వస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఏకంగా సెల్ ఫోన్ రేడియేషన్ పై ఓ సినిమా కూడా రూపొందింది. పల్లెటూళ్లు, ఓ మోస్తరు పట్టణాల్లో నివాస సముదాయాల మధ్య సెల్ టవర్ల నిర్మాణం […]

Advertisement
Update: 2021-06-30 02:38 GMT

సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ల వల్ల పిచ్చుకలు కనుమరుగయ్యాయని, పలు జాతుల పక్షులు అంతరించిపోతున్నాయని, ఆ రేడియేషన్ మనుషులకు కూడా హాని కలిగిస్తుందని ఇప్పటి వరకూ చాలామంది నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. సెల్ టవర్ల రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు వస్తాయని, క్యాన్సర్ కూడా వస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఏకంగా సెల్ ఫోన్ రేడియేషన్ పై ఓ సినిమా కూడా రూపొందింది. పల్లెటూళ్లు, ఓ మోస్తరు పట్టణాల్లో నివాస సముదాయాల మధ్య సెల్ టవర్ల నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడీ రేడియేషన్ వ్యవహారం అంతా తూచ్ అంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే రేడియేషన్ హానికరం కాదని తేల్చి చెప్పేశారు.

డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్స్ సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ హర్వేష్‌ భాటియా.. సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ ఉద్గారాలపై చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. విద్యుదయస్కాంత క్షేత్ర సంకేతాలపై తాము జరిపిన విస్తృత పరిశోధనల్లో సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ వల్ల ఎలాంటి హాని జరగదని తేలిందని, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యేందుకు ఆ రేడియేషన్ కారణం కాదని చెప్పారాయన.

సెల్ ఫోన్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ పై అపోహలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్‌ విభాగం నిర్వహించిన వెబినార్లో భాటియా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వెబినార్లో పాల్గొన్న ఇతర వైద్య నిపుణులు కూడా భాటియా వ్యాఖ్యలను సమర్థించడం గమనార్హం. సెల్ ఫోన్ టవర్ల వల్ల ఎలాంటి హాని ఉండదని తేలడంతో.. మరిన్ని టవర్లు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయినట్టేనని అంటున్నారు నిపుణులు.

అంతా బాగానే ఉన్నా.. అసలీ పరిశోధన విషయం వెబినార్ జరిగే వరకు ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. సదరు పరిశోధనలు ఎవరెవరు చేశారు, రేడియేషన్ ని ఎలా నిర్థారించారు, శాంపిల్స్ ఎలా పరీక్షించారు, ఫలితాలను ఎక్కడ ప్రచురించారనేది తేలాల్సి ఉంది. సెల్ ఫోన్ రేడియేషన్ అనేది అంతర్జాతీయ సమస్య. మరి ఇతర దేశాల్లో దీనిపై ఎలాంటి పరిశోధనలు జరిగాయి, భారత్ పరిశోధనలతో అవి సరిపోల్చారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ప్రైవేటు టెలికమ్యూనికేషన్ సంస్థలకోసమే ప్రభుత్వం ఇలాంటి పరిశోధనలను ప్రోత్సహిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. వాటికోసమే అధికారులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

జనావాసాల మధ్య సెల్ టవర్ల ఏర్పాటు ప్రైవేటు కంపెనీలకు తలకు మించిన భారంలా మారింది. సిగ్నల్ సమస్యలను అధిగమించాలంటే టవర్ల సంఖ్య విస్తృతంగా పెంచాల్సి ఉంటుంది. అదే సమయంలో వాటి ఏర్పాటు ప్రైవేటు కంపెనీలకు సమస్యగా మారింది. ఈదశలో ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం చేపట్టిన పరిశోధన ఫలితాలు మరిన్ని వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. శాస్త్రవేత్తల పరిశోధనలు ఎలా ఉన్నా.. ప్రజల్లో మాత్రం సెల్ టవర్ల ఏర్పాటు పట్ల విముఖత అప్పుడే తొలగిపోయే అవకాశం లేదు. నివాస సముదాయాల మధ్య సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రజలు అంత తేలిగ్గా ఒప్పుకునే అవకాశం లేదు.

Tags:    
Advertisement

Similar News