ఎంబీబీఎస్ చరిత్రలోనే రికార్డ్ బ్రేక్... 64ఏళ్ల వ్యక్తికి మెడిసిన్ లో సీటు

ఉద్యోగ విరమణ తర్వాత ఎవరైనా ఏమని ఆలోచిస్తారు..? మనవళ్లు, మనవరాళ్లతో ప్రశాంత జీవనం గడపాలని కోరుకుంటారు, పుణ్యక్షేత్రాలు తిరిగి కృష్ణారామా అనుకుంటూ ఉండాలనుకుంటారు. ఇంకొంతమంది సామాజిక సేవతో సంతృప్తి పొందుతారు. మొత్తమ్మీద ఎవరైనా.. ఇక మిగిలింది శేష జీవితమే అనుకుంటారు. కానీ 64ఏళ్ల జయకిషోర్ ప్రధాన్ మాత్రం.. బ్యాంక్ ఉద్యోగిగా రిటైర్మెంట్ తర్వాత కొత్త జీవితం ప్రారంభించారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా కాలేజీకి వెళ్తున్నారు. ఎవరీ జయకిషోర్ ప్రధాన్… ఒడిశాలోని బార్ఘర్ ప్రాంతానికి చెందిన […]

Advertisement
Update: 2020-12-27 02:14 GMT

ఉద్యోగ విరమణ తర్వాత ఎవరైనా ఏమని ఆలోచిస్తారు..? మనవళ్లు, మనవరాళ్లతో ప్రశాంత జీవనం గడపాలని కోరుకుంటారు, పుణ్యక్షేత్రాలు తిరిగి కృష్ణారామా అనుకుంటూ ఉండాలనుకుంటారు. ఇంకొంతమంది సామాజిక సేవతో సంతృప్తి పొందుతారు. మొత్తమ్మీద ఎవరైనా.. ఇక మిగిలింది శేష జీవితమే అనుకుంటారు. కానీ 64ఏళ్ల జయకిషోర్ ప్రధాన్ మాత్రం.. బ్యాంక్ ఉద్యోగిగా రిటైర్మెంట్ తర్వాత కొత్త జీవితం ప్రారంభించారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా కాలేజీకి వెళ్తున్నారు.

ఎవరీ జయకిషోర్ ప్రధాన్…

ఒడిశాలోని బార్ఘర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి జయకిషోర్ ప్రధాన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తూ 2016లో పదవీ విరమణ చేశారు. కట్ చేస్తే 2020 నాటికి ఆయన ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా మారారు. 64ఏళ్ల వయసులో కాలేజీ బుల్లోడి గెటప్ లో క్లాసులకు వెళ్తున్నారు. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసే నాటికి 70ఏళ్లు. వయసు అనేది కేవలం ఓ నెంబర్ మాత్రమే, తన జీవితంపై వయసు ప్రభావం తక్కువ అని అంటారు జయకిషోర్.

ఎంబీబీఎస్ కి అనుమతి ఎలా ఇచ్చారు..?

ఏ వయసు వారయినా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేయడానికి ఎంబీబీఎస్ సాధారణ కోర్సు కాదు. నీట్ ఎగ్జామ్ కి 25 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉంది. అయితే తన చదువుకోసం 2018లో సుప్రీంకోర్టుని ఆశ్రయించి మరీ అనుమతి సాధించారు జయకిషోర్. చివరకు అనుకున్నది సాధించారు. నీట్ లో ర్యాంకు సాధించి, ఒడిశాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (విమ్సార్) లో సీటు సాధించారు. తెల్లకోటు వేసుకుని క్లాసులకు హాజరవుతున్నారు. ఏళ్ల తరబడి నీట్ కోసం కుస్తీలు పడుతున్న కుర్రకారుకి ఆదర్శంగా నిలిచారు జయకిషోర్.

ఈ వయసులో ఎందుకీ తాపత్రయం…

ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1970లో ఓ సారి మెడికల్ ఎంట్రన్స్ రాశారట జయకిషోర్. అప్పట్లో సీటు రాకపోవడంతో మెడిసిన్ కోసం మరో ఏడాది వృథా చేసుకునే ఉద్దేశం లేక డిగ్రీలో చేరిపోయారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు రిటైర్మెంట్ తర్వాత తాను అనుకున్నది సాధించారు. అయితే తన ఇద్దరు కూతుళ్ల మరణంతో వైద్య వృత్తి చేపట్టాలనే ధృఢ సంకల్పానికి వచ్చానని చెబుతారు జయకిషోర్. తాను పట్టా పుచ్చుకునేది కేవలం సమాజ సేవకోసం మాత్రమేనంటున్నారు.

ప్రజల్లో వైద్యం పట్ల మరింత అవగాహన పెంచి, పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తానని, జీవితాంతం అదే పనిలో ఉంటానని చెబుతున్నారు. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు.. అన్నారు శ్రీశ్రీ.. కొంతమంది పెద్దవాళ్లు.. మరణించే వరకు యువకులే అని నిరూపిస్తున్నారు జయకిషోర్. ఎంబీబీఎస్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.

Advertisement

Similar News