కర్నాటకలో ఏపీ తరహా సచివాలయ వ్యవస్థ..

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కరోనా కష్టకాలంలో సచివాలయ వ్యవస్థ పనితీరుని మెచ్చుకున్న సందర్భం ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ ఫోక్రియాల్ గతంలో.. ఏపీ సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆమధ్య మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ ప్రభుత్వాలు కూడా ఏపీ సచివాలయ […]

Advertisement
Update: 2020-11-28 00:56 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కరోనా కష్టకాలంలో సచివాలయ వ్యవస్థ పనితీరుని మెచ్చుకున్న సందర్భం ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసింది.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ ఫోక్రియాల్ గతంలో.. ఏపీ సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆమధ్య మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ ప్రభుత్వాలు కూడా ఏపీ సచివాలయ వ్యవస్థ అమలుతీరుపై ఆరా తీశాయి. ఇప్పుడు ఏకంగా కర్నాటక రంగంలోకి దిగింది. కర్నాటకలో కూడా త్వరలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు యడియూరప్ప సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం క్షేత్రస్థాయి పరిశీలనకోసం 10మంది బృందాన్ని ఏపీకి పంపించింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులతో కూడిన ఈ బృందం ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తోంది.

కర్నాటక పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్, బళ్లారి జిల్లా పరిషత్ సీఈవో నందిని.. ఆధ్వర్యంలో అధికారులు అనంతపురం జిల్లాలోని పలు సచివాలయాలను సందర్శించారు. అక్కడి పనితీరుపై ఓ అవగాహనకు వచ్చారు. నేరుగా సచివాలయ సిబ్బందితో మాట్లాడి వారి అనుభవాలను నోట్ చేసుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సిరి ద్వారా మరింత సమాచారం తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలను కలిపి ఉంచే సాఫ్ట్ వేర్, సచివాలయాల్లో అందిస్తున్న సేవలు, వాటి రుసుములు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. అన్నిటిపై సమగ్రంగా ఈ బృందం అధ్యయనం చేస్తోంది. గ్రామస్తులు తమ ఊరుదాటి వెళ్లకుండా అన్ని సేవలు సచివాలయాలలోనే అందుబాటులో ఉండటంపై కర్నాటక అధికారుల బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సచివాలయ వ్యవస్థపై ప్రశంసల జల్లు కురిపించింది. త్వరలోనే కర్నాటకలో కూడా ఏపీ తరహా సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రాబోతోందన్నమాట. అదే జరిగితే.. ఇతర రాష్ట్రాలు కూడా పాలనా సౌలభ్యం కోసం ఏపీ విధానాన్ని అనుసరించడం ఖాయమనే చెప్పాలి.

Advertisement

Similar News