బీజేపీ తరపున పవన్ ప్రచారం చేస్తారా..? లేదా..??

విస్తృత ప్రయోజనాలకోసం అంటూ పవన్ కల్యాణ్ గ్రేటర్ బరినుంచి తప్పుకున్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారనే విషయం తెలిసి కూడా సీట్లన్నీ బీజేపీకి త్యాగం చేశారు. బీజేపీ, జనసేన తరపున ఒక్క ఓటు కూడా బైటకు పోకూడదని, అన్నీ బీజేపీకే పడాలని మరీ సందేశమిచ్చారు జనసేనాని. అలా బైటకు పోకుండా ఉండాలంటే, గ్రేటర్ లో బీజీపీకి ఆధిక్యం తేవడమే ఆయన లక్ష్యమైతే పవన్ కల్యాణ్ కూడా బీజేపీ తరపున గ్రేటర్ లో ప్రచారం చేయాలి. కానీ […]

Advertisement
Update: 2020-11-23 00:09 GMT

విస్తృత ప్రయోజనాలకోసం అంటూ పవన్ కల్యాణ్ గ్రేటర్ బరినుంచి తప్పుకున్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారనే విషయం తెలిసి కూడా సీట్లన్నీ బీజేపీకి త్యాగం చేశారు. బీజేపీ, జనసేన తరపున ఒక్క ఓటు కూడా బైటకు పోకూడదని, అన్నీ బీజేపీకే పడాలని మరీ సందేశమిచ్చారు జనసేనాని.

అలా బైటకు పోకుండా ఉండాలంటే, గ్రేటర్ లో బీజీపీకి ఆధిక్యం తేవడమే ఆయన లక్ష్యమైతే పవన్ కల్యాణ్ కూడా బీజేపీ తరపున గ్రేటర్ లో ప్రచారం చేయాలి. కానీ కిషన్ రెడ్డితో భేటీ తర్వాత ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ గ్రేటర్ ప్రచారంపై నోరు మెదపలేదు. జనసేన అభ్యర్థులు బరిలో నిలబడితే కచ్చితంగా ఆయన ప్రచార పర్వాన్ని మొదలు పెట్టి ఉండేవారు. ఇప్పుడు అదే విస్తృత ప్రయోజనాలకోసం పవన్ జనాల్లోకి వెళ్తారా? లేదా? అనేది అనుమానంగా మారింది.

పవన్ ప్రచారానికి వెళ్లే లోపే.. టీఆర్ఎస్ నుంచి వాగ్బాణాలు దూసుకొస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, పవన్ ని టార్గెట్ చేసుకుని మాట్లాడిన మాటలు గ్రేటర్ ఎన్నికల బరిలో సంచలనంగా మారాయి. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు.. గతంలో తమ పార్టీ నేతలు పవన్ పై చేసిన విమర్శలను మరోసారి సోషల్ మీడియాలో ప్రముఖంగా షేర్ చేస్తున్నారు. దీంతో అనివార్యంగా పవన్ కల్యాణ్ టీఆర్ఎస్ కి టార్గెట్ అయ్యారు.

ఇక నేరుగా పవన్ నోరు చేసుకుని, ప్రచారంలో టీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడితే.. ఆయన్ని గులాబిదళం ఊరికే వదిలిపెడుతుందా? పోనీ పవన్ నేరుగా టీఆర్ఎస్ తో శతృత్వం పెంచుకుని సాధించేది ఏమైనా ఉంటుందా? ప్రశ్నలు జనసేనవి, పదవులు ఇతర పార్టీలవి అంటూ ఇటీవలే పార్టీ నాయకుల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పవన్. అలాంటి జనసేనాని.. మరోసారి బీజేపీకోసం టీఆర్ఎస్ కి టార్గెట్ అవుతారా అనేది తేలాల్సి ఉంది.

మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు కూడా పవన్ ప్రచారాన్ని కోరుకుంటున్నట్టు లేరు. పవన్ లాంటి కరిష్మా ఉన్న నాయకులు వస్తే జనం గుమికూడతారు కానీ వారిలో ఎంతమంది ఓట్లేస్తారనేదే ప్రశ్న. 2019 ఎన్నికల్లో కూడా పవన్ సభలకు, ర్యాలీలకు జనం భారీగా తరలి వచ్చినా చివరకు ఓట్లు, సీట్ల విషయంలో జనసేన పూర్తిగా విఫలం అయింది. ఇప్పుడు కూడా గ్రేటర్ లో పవన్ ని బీజేపీ తరపున ప్రచార బరిలో దింపితే… లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశముంది.

జనసేన, టీడీపీని ఇంకా ఒకటిగానే చూసేవారు, ఆరెండు పార్టీలంటే ఇష్టంలేని వారు కచ్చితంగా బీజేపీకి వ్యతిరేక ఓటు వేస్తారు. పరోక్షంగా అది టీఆర్ఎస్ కి లాభం చేకూరుస్తుందనేది తెలంగాణ బీజేపీ భావన. అందుకే ఆ శిబిరం నుంచి పవన్ ని కనీసం ప్రచారానికి కూడా ఎవరూ ఆహ్వానించలేదు.

Advertisement

Similar News