Telugu Global
Telangana

తెలంగాణలో భారీగా పెరిగిన వరి సాగు.. పత్తి, మిర్చి పంటల్లోనూ పెరుగుదల

తెలంగాణలో దిగుబడి అవుతున్న వరి ధాన్యం విలువ రూ.8,291 కోట్ల నుంచి రూ.16,599 కోట్లకు పెరిగిందని తెలిపింది. అంటే పదేళ్ల కాలంలో దిగుబడి విలువ 99 శాతం మేర పెరిగిందని వివరించింది.

తెలంగాణలో భారీగా పెరిగిన వరి సాగు.. పత్తి, మిర్చి పంటల్లోనూ పెరుగుదల
X

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా గత పదేళ్లలో తెలంగాణలో వరి సాగు భారీగా పెరిగింది. 2011-12 నుంచి 2021-22 మధ్య తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం, పంట దిగుబడి భారీగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో దిగుబడి అవుతున్న వరి ధాన్యం విలువ రూ.8,291 కోట్ల నుంచి రూ.16,599 కోట్లకు పెరిగిందని తెలిపింది. అంటే పదేళ్ల కాలంలో దిగుబడి విలువ 99 శాతం మేర పెరిగిందని వివరించింది.

రాష్ట్రంలో వరి దిగుబడి 99 శాతం పెరిగినా.. కూరగాయలు, ఇతర పంటల సాగు 46 శాతం మేర తగ్గిపోయిందని.. ఇది ఆందోళన కలిగిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గత పదేళ్లలో వరి దిగుబడి ఇంతలా మరే రాష్ట్రంలో కూడా పెరగలేదని నివేదికలో పేర్కొన్నది. దేశంలో అత్యధిక వరి పండించే పంజాబ్ రాష్ట్రంలో కేవలం 28 శాతం మాత్రమే వృద్ధి నమోదైనట్లు చెప్పింది. అక్కడ పదేళ్ల క్రితం రూ.17,565 కోట్ల పంట దిగుబడి రాగా.. 2021-22లో రూ.22,544 కోట్లకు పెరిగినట్లు తెలిపింది.

వరి పంటకు ఎక్కువ నీరు అవసరం అవుతుంది. అయితే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు భారీగా నిర్మించడంతోనే వరి సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్రం తెలిపింది. అంతే కాకుండా ఇతర పంటల మాదిరిగా వరికి మార్కెట్ భయాందోళనలు లేవు. తెలంగాణలో కనీస మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తోంది. ఇన్ని సానుకూలతలు ఉండటం వల్లే వరి పంటను రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ మాజీ రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు.

తెలంగాణలో కూలీల కొరత ఉన్నందున రైతులు హార్టిక‌ల్చ‌ర్‌ పంటల వైపు మొగ్గు చూపడం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో పొలాల్లో పని చేయడానికి ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని అన్నారు. కూరగాయలు, ఇతర పంటలకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. కొంత మంది రైతులు జార్ఖండ్, బీహార్ నుంచి కూలీలను తీసుకొని వచ్చి ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంలో కూడా అమలు చేస్తే తెలంగాణలో ఇతర పంటల సాగు మరింతగా వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. కాగా, పత్తి పంట సాగులో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత స్థానంలో.. మిర్చి సాగులో ఏపీ తర్వాత స్థానంలో తెలంగాణ ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

First Published:  10 May 2023 5:29 AM GMT
Next Story