Telugu Global
Health & Life Style

తిన్న వెంటనే నడిస్తే... ఎన్ని లాభాలో...

రాత్రులు భోజనం చేసిన తరువాత నడవటం మాత్రం మన శరీరానికి మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

తిన్న వెంటనే నడిస్తే... ఎన్ని లాభాలో...
X

ఏ వ్యాయామం అయినా తిన్నవెంటనే చేయటం మంచిది కాదని ... రెండుమూడు గంటల తేడా అయినా ఉండాలని అంటారు వ్యాయామ నిపుణులు. అయితే రాత్రులు భోజనం చేసిన తరువాత నడవటం మాత్రం మన శరీరానికి మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రివేళ ఆహారం తీసుకున్న తరువాత నడిస్తే ఏమవుతుందో... తెలుసుకుందాం...

♦ రాత్రి భోజనం అనంతరం నడవటం వలన మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. తినగానే నిద్రపోవటం అనేక రకాల ఆరోగ్యసమస్యలకు దారితీసే అవకాశం ఉంది. దీనివలన జీర్ణ సంబంధమైన సమస్యలతో పాటు అనారోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతారు. రాత్రి భోజనం తరువాత నడవటం వలన ఆహారం బాగా జీర్ణమవుతుంది. తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం మరింత బాగా శోషించుకుంటుంది. డిన్నర్ తరువాత నడవటం వలన హ్యాపీ హార్మోన్లు విడుదల అవటం, ఆహారం బాగా జీర్ణమవటం రెండూ జరిగి చక్కని నిద్రపడుతుంది. తిన్నవెంటనే నడవటం వలన శరీరం తగినంత శక్తిని తీసుకుంటుంది. అలా కూడా నిద్రబాగా పడుతుంది.

రాత్రి భోజనం తరువాత నడవటం వలన వెంటనే చక్కని నిద్రపడుతుంది. దీనివలన రాత్రులు ఎక్కువగా మేలుకుని ఉండి ఆ సమయంలో ఆహారం తినటం ఉండదు.

♦ ఎక్కువగా తిని ఏ పనీ చేయకుండా అలాగే నిద్రపోవటం వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నడవటం వలన తప్పనిసరిగా కొన్ని కేలరీలు ఖర్చవుతాయి.

♦ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన శరీరంలో జీవక్రియలు జరుగుతుంటాయి. దీనినే మెటబాలిజం అంటారు. వ్యాయామంతో మన శరీరం పోషకాలను ఎక్కువగా శోషించుకోవటం వలన మెటబాలిజం వేగవంతమవుతుంది. అలాగే తిన్నతరువాత నడవటం వలన కూడా మెటబాలిజం పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయటం వలన ఈ ఫలితం ఉంటుంది.

♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో రక్తప్రసరణ బాగుంటుంది. రాత్రి భోజనం తరువాత నడవటం వలన కూడా ఈ ఫలితం ఉంటుంది. ఈ నడక వలన గుండెవ్యాధులను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం ఉన్నవారిలో తిన్న తరువాత చెక్కర స్థాయి పెరిగే అవకాశం ఉంది. నడక ద్వారా ఆ పెరుగుదలను తగ్గించవచ్చు. వ్యాయామం రక్తపోటుని, కొలెస్ట్రాల్ ని సైతం తగ్గిస్తుంది.

రాత్రి భోజనం తరువాత నడవటం మంచిదే కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. తిన్న వెంటనే కాకుండా పది నుండి ఇరవై నిముషాలపాటు ఆగి తరువాత నడవటం మంచిది. అలాకాకుండా వెంటనే నడిస్తే... పొట్టలో ఏవైనా సమస్యలు రావచ్చు.

First Published:  13 Oct 2022 7:29 AM GMT
Next Story