Telugu Global
Health & Life Style

రోజుకి పదివేల అడుగులు... ఇతర వ్యాయామాలు అక్కర్లేదా?

రోజూ వాకింగ్ చేయటం వలన ఎన్నోరకాలుగా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత, సృజనాత్మకత పెరుగుతాయి.

రోజుకి పదివేల అడుగులు... ఇతర వ్యాయామాలు అక్కర్లేదా?
X

రోజుకి పదివేల అడుగులు... ఇతర వ్యాయామాలు అక్కర్లేదా?

రోజూ వాకింగ్ చేయటం వలన ఎన్నోరకాలుగా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత, సృజనాత్మకత పెరుగుతాయి. శరీరం, మనసు రెండింటికీ ఒకేసారి ప్రయోజనాన్ని ఇచ్చే వ్యాయామాల్లో వాకింగ్ ప్రధానమైనది. రోజుకి పదివేల అడుగులు వేస్తే ఆరోగ్యానికి అదే పదివేలు అని చెప్పవచ్చు. రోజుకి పదివేల అడుగులు నడవగలిగితే అది ఆరోగ్యవంతమైన జీవనశైలికి పునాదిగా మారుతుంది. అయితే ఇవన్నీ తెలుసుకున్నాక వాకింగ్ చేసేవారు ఇతర వ్యాయామాలు, వర్కవుట్లు చేయకపోయినా పర్వాలేదా... అనే సందేహం కలుగుతుంది కదా... వాకింగ్ తో గుండెకు ఎంతో ప్రయోజనం ఉన్నప్పటికీ అది వర్కవుట్లు చేసినప్పుడు లభించినంత స్థాయిలో శ్రమ, వ్యాయామాలను శరీరానికి అందించదని కనుక నడకతో పాటు ఇతర వ్యాయామాలు కూడా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు.

వాకింగ్ తో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరెన్నో రకాల లాభాలు నడకతో ఉన్నా శారీరక ఆరోగ్యం, ఫిట్ నెస్ లను పూర్తిస్థాయిలో పొందాలని అనుకునేవారు వాకింగ్ తో పాటు ఏరోబిక్ వర్కవుట్లు, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి ఇతర వ్యాయామాలను సైతం చేయటం మంచిది. అయితే గుండె ఆరోగ్యానికి మాత్రం వాకింగ్ తప్పనిసరి అని గుండెవ్యాధుల నిపుణులు సలహా ఇస్తున్నారు. అంటే ఇతర వ్యాయామాలు చేసేవారు కూడా గుండె ఆరోగ్యం కోసం నడకని తప్పకుండా తమ ఫిట్ నెస్ రొటీన్ లో భాగం చేసుకోవాలి.

నడకతో గుండె పదిలం

వాకింగ్ వలన గుండె కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడతుంది. ఊపిరితిత్తుల సామర్ధ్యం సైతం పెరుగుతుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

చెడు కొలెస్ట్రాల్ కి చెక్

రోజువారీ వాకింగ్ చేసేవారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంటే వాకింగ్ తో చెడు కొలెస్ట్రాల్ వలన గుండె అనారోగ్యాల పాలు కాకుండా నివారించవచ్చు.

బరువు అదుపులో

శరీర బరువుని తగ్గించడంలో వాకింగ్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బరువు పెరగటం వలన వచ్చే గుండెవ్యాధులను వాకింగ్ నివారిస్తుంది.

రక్తంలో చెక్కర క్రమబద్ధంగా...

వాకింగ్ వలన రక్తంలో చెక్కర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది. దీనివలన టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉండదు. టైప్ టు డయాబెటిస్ కూడా గుండెవ్యాధులకు కారణమవుతుంది కనుక నడక ఈ విధంగా కూడా గుండెకు మేలు చేస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది

నడకతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది సహజమైన ఒత్తిడి నివారణ సాధనంగా పనిచేస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నవారు నడకతో దానిని తగ్గించుకుంటే గుండెకు మేలు చేసుకున్నట్టే అవుతుంది.

First Published:  26 Sep 2023 6:01 AM GMT
Next Story