Telugu Global
Health & Life Style

అతిగా తింటే అన‌ర్ధ‌మే..! అవి ఫ్రూట్స్ అయినా సరే ..

ఏ సీజ‌న్‌లోనైనా తాజా పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం క‌లుగుతుంద‌న‌డంలో అనుమానమే లేదు.

అతిగా తింటే అన‌ర్ధ‌మే..! అవి ఫ్రూట్స్ అయినా సరే ..
X

ఏ సీజ‌న్‌లోనైనా తాజా పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం క‌లుగుతుంద‌న‌డంలో అనుమానమే లేదు. ఎందుకంటే పండ్లలో ప‌లు పోష‌కాల‌తో పాటు విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌టంతో అవి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారమే కాకుండా ప‌లు వ్యాధుల బారి నుంచి మ‌న‌ల్ని కాపాడ‌తాయి. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే రకరకాల పండ్లను తినడానికి ఉత్సాహం చూపిస్తారు చాలామంది. అయితే మరికొందరు మాత్రం అత్యుత్సాహంతో అతిగా పండ్లను తింటుంటారు. ఇలా మోతాదుకి మించి పండ్లను తినడం వల్ల మన శరీరానికి కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ మోతాదుకు మించి తింటే ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు చూపుతాయని చెబుతున్నారు డాక్టర్లు. ప్రతిరోజు శరీరానికి కావాల్సిన పరిమాణంలో ఫ్రూట్స్​ తింటే మంచిదని సూచిస్తున్నారు.అంటే రోజుకి రెండు క‌ప్పుల పండ్ల ముక్క‌లు తీసుకుంటే బీపీ, కొవ్వు లెవెల్స్ అదుపులో ఉండ‌టంతో పాటు కొన్ని ర‌కాల క్యాన్స‌ర్ల నుంచి మ‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి. స్ట్రోక్‌, గుండెపోటు ముప్పును త‌గ్గిస్తాయి. అయితే అదే స‌మ‌యంలో అదే ప‌నిగా క‌డుపును పండ్ల‌తో నింపితే పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్‌, స‌హ‌జంగా ఉండే చ‌క్కెర (ఫ్ర‌క్టోజ్‌)లు ఇతర ద్ర‌వాల‌తో క‌లిసి కొంద‌రిలో డ‌యేరియాకు దారితీయ‌వ‌చ్చు. పండ్ల‌ను అతిగా తిన‌డం ద్వారా చ‌క్కెర నిల్వ‌లు అధిక‌మై బ‌రువు పెరిగే ప్ర‌మాదం ఉంది. మ‌ధుమేహ రోగులు పండ్ల‌ను ఎక్కువ‌గా తింటే బ్ల‌డ్ షుగ‌ర్ పెరుగుతుంది. పండ్ల‌ను ప‌రిమితికి మించి తింటే గ్యాస్‌, క‌డుపులో అసౌక‌ర్యం, జీర్ణ‌క్రియ‌లో ఇబ్బందులు త‌లెత్తుతాయి.

రోజుకు వంద గ్రాముల పండ్లను మాత్రమే తినాలి. ఈ క్వాంటిటీలో అన్ని రకాల పండ్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, తొక్కతో పాటే తినే పండ్లను డైట్​లో చేర్చుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సిన ఫైబర్​ అందుతుంది. ఇది మలబద్ధకం సమస్యనూ దూరం చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్​ అందుతాయి. అయితే పిల్లలు, గర్భిణీలతో పాటు తరచూ వ్యాయామం చేసేవారు పండ్లను క్రమం తప్పకుండా రోజూ తినవచ్చు. పండ్లను నేరుగా తినడం అనేది అన్నింటి కన్నా మంచిది. ఇలా చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పండ్లను కట్​ చేసి ఫ్రిజ్​లో పెట్టుకొని తినడం లేదా జ్యూస్​లు వగైరా లాంటివి చేసుకొని తాగడం ఏ మాత్రం అంతగా మంచిది కాదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.అలా చేయటం వల్ల అందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి లేదా పూర్తిగా మాయమైపోతాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు భోజనం తర్వాత పండ్లను మాత్రం అస్సలు తినకూడదని సూచిస్తున్నారు.

First Published:  14 March 2024 2:46 AM GMT
Next Story